New Delhi, December 9: దేశంలో నిన్న దేశంలో 26,567 కేసులు (Coronavirus in India) నమోదవగా ఈ రోజు గత 24 గంటల్లో కొత్తగా 32,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,35,850కి చేరాయి. ఇందులో 3,78,909 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు 92,15,581 మంది బాధితులు కోలుకున్నారు. ఇందులో గత 24 గంటల్లో 36,635 మంది మహమ్మారి నుంచి బయటపడి డిశ్చార్జీ అయ్యారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు 402 మంది మరణించారు.
దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,41,360కు (Covid Deaths) చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. దేశంలో నిన్న ఒకేరోజు 10,22,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో డిసెంబర్ 8 వరకు మొత్తం 14,98,36,767 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
భారత్ బయోటెక్ (Bharat Biotech) రూపొందిస్తున్న కొవిడ్-19 వైరస్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ (ముక్కు ద్వారా లోపలికి పంపే) తొలి విడత ట్రయల్స్ వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. భారత్ బయోటెక్ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కొవాగ్జిన్‌తో పాటు ఇంట్రా నాసల్ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇంట్రానాసల్ టీకా సింగిల్ డోసేనని, వచ్చే నెలలో ట్రయల్స్ ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే వ్యాక్సిన్లు ఇచ్చేందుకు దేశంలో 2.6 బిలియన్ల సిరంజీలు, సూదులు అవసరమన్నారు. భారత్ బయోటెక్ అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని కరోనా కోసం ‘చింపాజీ అడెనో వైరస్’ కోసం వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ సెయింట్ లూయిస్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ట్రయల్స్ యూనిట్ ఫేజ్-1 ట్రయల్స్‌ను రెగ్యులరేటరీ ఆమోదం పొందిన తర్వాత దేశంలో ట్రయల్స్ కొనసాగించనున్నట్లు తెలిపారు