COVID 19 Outbreak in India | PTI Photo

New Delhi, September 10: వరుస పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరిస్తూ కొన్ని సూచనలు చేసింది. ఉత్సవాలు, పర్వదిన వేడుకల్లో జాగ్రత్తలు పాటిస్తూ చూసుకోవాలని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సూచించారు.

అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని తెలిపారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మళ్లీ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా కేరళలో కరోనా విజృంభణపై రాజేశ్‌ భూషణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్‌ వేవ్‌ ఇంకా కొనసాగుతోందని గుర్తుచేశారు. ఇది ఇంకా ముగిసిపోలేదని స్పష్టం చేశారు.

గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 34,973 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 260 కోవిడ్ మరణాలు సంభవించాయి. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 26,200 కేసులు, 114 మరణాలు ఉన్నాయి.

తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,31,74,954 కు చేరింది, అలాగే ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,42,009కు పెరిగింది.

ఇక, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,681 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,23,42,299 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,90,646 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.49% కు చేరగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.18 శాతానికి పెరిగాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.33% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

సెప్టెంబర్ 9 నాటికి దేశవ్యాప్తంగా 53,86,04,854 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 17,87,611 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 67,58,491 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 72.37 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 72,37,84,586 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 55.18 కోట్లు ఉండగా, 17.19 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.