Coronavirus Cases in India (Photo Credits: PTI)

New Delhi, May 13: భారత్‌లో రోజూవారీ కోవిడ్ కేసులు నిన్నటికంటే ఈరోజు స్వల్పంగా పెరిగాయి. అయినపటికీ పరిస్థితులు మెల్లిమెల్లిగా కుదుటపడుతున్నాయి. మళ్లీ కోలుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఆక్టివ్ కేసులు తగ్గుతున్నాయి.  చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నాయి, వైరస్ వ్యాప్తిని వారి వారి పద్ధతుల్లో ఎక్కడికక్కడ కట్టడి చేసే నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే ప్రతిరోజు కరోనా మరణాల్లో మాత్రం గణనీయమైన మార్పులేమి కనిపించడం లేదు. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 4 వేలకు పైగా కరోనా మరణాలు సంభంచించడం కొంత ఆందోళన కలిగించే విషయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ రోగులకు మెరుగైన చికిత్స, సరిపడా ఆక్సిజన్ తదితర సౌకర్యాలపై దృష్టిపెడితే కోవిడ్ మరణాల సంఖ్య తగ్గించవచ్చు

గడిచిన భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 3,62,727 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,37,03,665 చేరింది. నిన్న ఒక్కరోజే 4,120 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,58,317కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,52,181 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,97,34,823 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 37,10,525 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 83.26%

స్వల్పంగా మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 15.65 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.09% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

మే 12 నాటికి దేశవ్యాప్తంగా 30,94,48,585 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 18,64,594 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో 45 ఏళ్ల పైబడిన వారికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. తర్వాత విడతల వారీగా 18 నుంచి 45 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 17.72 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 17,72,14,256 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.