New Delhi, August 25: దేశంలో నిన్న 25వేలకు చేరిన పాజిటివ్ కేసులు (Coronavirus in India) మళ్లీ భారీగా పెరిగాయి. మరో వైపు మరణాలు సైతం 600కుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,593 కొత్త కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 34,169 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి 24 గంటల్లో 648 మంది బాధితులు (648 Deaths in Past 24 Hours) మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.99 శాతం ఉన్నాయని, ప్రస్తుతం దేశంలో 3,22,327 యాక్టివ్ కేసులున్నాయి.
తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,25,12,366కు పెరగ్గా.. ఇందులో 3,17,54,281 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 4,35,758 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.67శాతానికి పెరిగిందని వివరించింది. ఇప్పటివరకు 59.55కోట్లకుపైగా మోతాదులు వేసినట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 17,92,755 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ పేర్కొంది. ఇప్పటి వరకు 51,11,84,547 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.
ఇక కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్రలో రోజు రోజుకు విస్తరిస్తున్నది. మంగళవారం ఒకేకేరోజు కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు 103కు చేరాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన వాటిలో గడ్చిరోలి, అమరావతిలో ఆరు చొప్పున, నాగ్‌పూర్‌లో ఐదు, అహ్మద్‌నగర్‌లో నాలుగు, యావత్మల్‌లో మూడు, నాసిక్‌లో రెండు, భాంద్రాలో ఒకటి చొప్పున ఉన్నాయి. కాగా, ముంబైలో 188 నమూనాలను సేకరించగా 128 నమూనాల్లో డెల్టా వేరియంట్ లక్షణాలు ఉన్నాయని, మరో రెండింటలో ఆల్ఫా వేరియంట్ లక్షణాలు ఉన్నాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. మహారాష్ట్రలో 3643 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సఖ్య 64,28,294కు చేరింది. ఇందులో 62,38,794 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది