New Delhi, August 2: దేశంలో గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్ కేసులు (Covid in India) రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కొత్తగా 36,946 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 422 మంది వైరస్ బారినపడి ప్రాణాలు (COVID 19 Deaths in India) కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,95,958కు పెరిగింది.
ఇందులో 3,08,57,467 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 4,24,773 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 4,13,718 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 47,22,23,639 టీకాలు వేశామని.. గత 24 గంటల్లో 17,06,598 డోసులు వేసినట్లు వివరించింది. దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నదని ఒక తాజా నివేదికలో వెల్లడయ్యింది. ప్రస్తుత ఆగస్టులోనే రోజుకు లక్షకుపైగా కేసులు నమోదు కావచ్చని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్, కాన్పూర్‌లలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లకు చెందిన మథుకుమల్లి విద్యాసాగర్, మణీంద్ర అగర్వాల్ నేతృత్వంలో జరిగిన పరిశోధనల్లో పలు ఆసక్తికర వివరాల వెల్లడయ్యాయి. అక్టోబరు నాటికి దేశంలో కరోనా వైరస్ మరోమారు పీక్‌స్టేజ్‌కి చేరుకుంటుందని ఆ నివేదికలో తెలిపారు. విద్యాసాగర్ ఒక ఈ మెయిల్‌లో తెలిపిన వివరాల ప్రకారం కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఇప్పుడున్న కరో్నా పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ థర్డ్‌వేవ్ గతంలో వచ్చిన సెకెండ్‌వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు పెద్ద మొత్తంలో నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో కేరళ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేరళ నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ తమిళనాడు నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు ఈ నెల 5 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. వరుసగా ఐదో రోజు శనివారం కూడా కేరళలో 20వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ఉత్తరాఖండ్ లో సోమవారం 632 కేసులు నమోదైనాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వ్యాప్తి చెందుతుండటంతో ఛార్‌ధాం యాత్రతోపాటు పర్యాటకుల సందర్శనలను నిలిపివేయాలని హైకోర్టు సర్కారును కోరింది.నైనిటాల్ ప్రాంతంలో 75 శాతం సందర్శకులు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని, దీనివల్లనే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.