COVID19 Outbreak in India | Photo: ANI

New Delhi, May 6: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. గురువారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా  4.12 లక్షల కోవిడ్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇటీవల కాలంగా రోజూవారీ పాజిటివ్ కేసులు 4 లక్షల మార్కును దాటడం ఇది రెండోసారి. అలాగే 4 వేలకు చేరువగా కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 900 మందికి పైగా మరణాలు ఉన్నాయి.  RT-PCR పరీక్షల్లో కూడా ఇదివరకు కనుగొనబడని ఒక కొత్త రకం వైరస్ మ్యూటెంట్ ఈ మరణాలకు కారణం కావొచ్చని వైద్య శాస్త్ర నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ మ్యూటెంట్ నేరుగా ఉపిరితిత్తులపై ప్రభావం చూపడం ద్వారా మరణాలకు కారణమవుతుందని అనుమానిస్తున్నారు.

భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే,  దేశవ్యాప్తంగా కొత్తగా మరో 4,12,262 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,77,410కు చేరింది. నిన్న ఒక్కరోజే 3,980 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 23,01,68 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,29,113 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,72,80,844 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 35,66,398 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 81.99 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 16.92 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.09% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

మే 5 నాటికి దేశవ్యాప్తంగా 29,67,75,209 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 19,23,131 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 16.25 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 16,25,13,339 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.