COVID19 in India: భారత్‌లో కొత్తగా 42,982 కోవిడ్ కేసులు మరియు 533 మరణాలు నమోదు; కేరళ రాష్ట్రంలో తగ్గని కరోనా ఉధృతి, కరోనా సోకిన వారిని గుర్తించడంలో అక్కడి యంత్రాంగం విఫలమైనట్లు కేంద్రం నిర్ధారణ
COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, August 5: భారత్‌లో ఇటీవల 30 వేలకు తగ్గిన రోజూవారీ కోవిడ్ కేసులు ఇప్పుడు మళ్లీ 40 వేలకు పైగా నమోదవుతున్నాయి. కేరళ రాష్ట్రంలో కరోనా విళయతాండవం కొనసాగుతోంది. నిన్న కూడా కేరళలో 22 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కొత్త కేసులలో 43 శాతం ఈ రాష్ట్రం నుంచే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కేసుల పెరుగుదలకు కారణాలు అణ్వేషించడానికి వెళ్లిన కేంద్ర బృందం అక్కడి పరిస్థితులపై ఆరా తీసింది. కరోనా సోకిన వారిని సరిగ్గా గుర్తించకపోవడం, ఐసోలేషన్ చేయడానికి సరిపడా వసతులు లేకపోవడంతోనే కేరళలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారని కేంద్ర బృందం నిర్ధారణకు వచ్చింది. ఇక దేశంలోని మిగతా చోట్ల కోవిడ్ కేసులు ఓ మోస్తారు స్థాయిలో వస్తున్నాయి. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న సందర్బంలో నిర్లక్ష్యం చేస్తే రోజూవారీ కోవిడ్ కేసులు రోజుకు 1.40 లక్షలుగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 42,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,12,114 కు చేరింది. నిన్న ఒక్కరోజే 533 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,26,290కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,726 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,09,74,748 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,11,076 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.37% స్వల్పంగా తగ్గగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.29 శాతానికి పెరిగాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఆగష్ట్ 4 నాటికి దేశవ్యాప్తంగా 47,48,93,363 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 16,64,030 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 37,55,115 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 5 కోట్లకు చేరువైంది.. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 48,93,42,295 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 38.11 కోట్లు ఉండగా, 10.82 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.