COVID19 in India: భారత్‌లో కొత్తగా 43,263 కోవిడ్ కేసులు, 338 మరణాలు నమోదు మరియు 40,567 మంది రికవరీ; గడిచిన ఒక్కరోజులో కేరళ రాష్ట్రం నుంచే 30 వేలకు పైగా కొత్త కేసులు నిర్ధారణ
Covid in India | (Photo-PTI)

New Delhi, September 9: కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది, ఆ రాష్ట్రంలో మళ్లీ 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో భారతదేశం యొక్క రోజూవారీ కోవిడ్ కేసుల్లో అకస్మాత్తుగా భారీ పెరుగుదల చోటుచేసుకుంటుంది. ఈ రోజు కూడా భారత్ 43 వేలకు పైబడి కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న మొత్తం కొత్త కేసులలో మూడింట రెండు వంతుల కేసులు కేరళ రాష్ట్రం నుంచి ఉండటం గమనార్హం.

గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 43,263 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 338 కోవిడ్ మరణాలు సంభవించాయి. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 30,196 కేసులు, 181 మరణాలు ఉన్నాయంటే ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,31,39,981 కు చేరింది, అలాగే ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,41,749 కు పెరిగింది.

ఇక, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 40,567 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,23,04,618 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,93,614 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.48% కు చేరగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.19 శాతానికి పెరిగాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.33% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

సెప్టెంబర్ 8 నాటికి దేశవ్యాప్తంగా 53,68,17,243 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 18,17,639 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 86,51,701 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 71.65 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 71,65,97,428 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 54.68 కోట్లు ఉండగా, 16.97 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.