
New Delhi, July 9: భారత్‌లో సెకండ్ వేవ్ కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ కోవిడ్ కేసులు నిన్నటికంటే ఈరోజు 2 వేల మేర కేసులు తగ్గాయి, అయితే మరణాలు మళ్లీ 9 వందలకు పైగా నమోదయ్యాయి. ఏదైమైనా దేశంలో కోవిడ్ పాజిటివిటీ రేటు అదుపులోనే ఉంది, వరుసగా మూడో వారం కూడా కరోనా పాజిటివిటీ రేటు 3 శాతానికి దిగువలోనే కొనసాగుతుంది.
కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా నివారణ చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. కరోనా నివారణే లక్ష్యంగా దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. అలాగే, దేశవ్యాప్తంగా ఆక్సిజన్ లభ్యతను సమీక్షించడానికి శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.
ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 43,393 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,52,950 చేరింది. నిన్న ఒక్కరోజే 911 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,05,939కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,459 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,98,88,284 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,58,727 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.18% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.50 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.32% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
India reports 43,393 new #COVID19 cases, 44,459 recoveries, and 911 deaths in the last 24 hours, as per Health Ministry
Total cases: 3,07,52,950
Total recoveries: 2,98,88,284
Active cases: 4,58,727
Death toll: 4,05,939
Total vaccinated: 36,89,91,222 (40,23,173 in last 24 hrs) pic.twitter.com/mjo2HgtgZg
— ANI (@ANI) July 9, 2021
జూలై 8 నాటికి దేశవ్యాప్తంగా 42,70,16,605 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 17,90,708 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 40,23,173 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 36.89 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 36,89,91,222 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 29.86 కోట్లు ఉండగా, 7.03 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.