New Delhi, July 29: భారత్‌లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ వారంలో వరుసగా మూడవ రోజు రోజూవారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుంది. ట్రెండ్ ఇలాగే కొనసాగితే మరో వారంరోజుల్లోనే సెకండ్ వేవ్ యొక్క గరిష్ట స్థాయికి రోజూవారీ కేసులు చేరుకునే అవకాశం ఉంది. దేశంలో హఠాత్తుగా కోవిడ్ కేసుల పెరుగుదలకు ప్రధానంగా కేరళ రాష్ట్రం కారణంగా కనిపిస్తుంది. ఆ రాష్ట్రంలో రోజురోజుకి పెద్ద ఎత్తున కేసుల పెరుగుదల ఉంది, ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కొత్త కేసులలో 50% పైగా కేరళ నుంచే ఉండటం గమనార్హం. మరోవైపు రికవరీ అయ్యే వారి సంఖ్యలో మార్పు ఉండకపోవడంతో దేశంలో ఆక్టివ్ కేసుల సంఖ్య పెరిగి మళ్లీ 4 లక్షలు దాటింది. సెకండ్ వేవ్ అదుపులోకి వస్తుందనుకుంటున్న తరుణంలో కోవిడ్ కేసుల పెరుగుదల థర్డ్ వేవ్‌కు దారితీస్తుందా అనే సంకేతాలు కల్పిస్తుంది.
ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 43,509 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేరళ నుంచే 22 వేల కేసులు, 121 మరణాలు ఉండగా, మహారాష్ట్ర నుంచి సుమారు 7 వేల కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 640 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,22,662కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38,465 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,07,01,612 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,03,840 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.38% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.28 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
India reports 43,509 fresh infections, 38,465 recoveries in the last 24 hours; Active caseload currently at 4,03,840, recovery rate at 97.38%: Ministry of Health and Family Welfare pic.twitter.com/yAKlSwOFaQ
— ANI (@ANI) July 29, 2021
జూలై 28 నాటికి దేశవ్యాప్తంగా 46,26,29,773 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 17,28,795 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 43,92,697 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 45 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 45,07,06,257 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 33.25 కోట్లు ఉండగా, 9.81 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.