New Delhi, August 6: భారత్‌లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే రోజూవారీ కేసులు సుమారు 2 వేల మేర పెరిగి 44 వేల మార్కును దాటాయి. కేరళ రాష్ట్రంలో కరోనా విళయతాండవం కొనసాగుతోంది. నిన్న కూడా కేరళలో 22 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది, గడిచిన ఒక్కరోజులో ఆ రాష్ట్రం నుంచి కొత్తగా మరో 23,676 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో నమోదవుతున్న కొత్త కేసులలో సగానికి పైగా ఈ రాష్ట్రం నుంచే ఉంటున్నాయి. దేశంలో సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే థర్డ్ వేవ్ వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆక్టివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి.
కరోనావైరస్ యొక్క ప్రమాదకరమైన వివిధ వేరియంట్లను కట్టడి చేయడం కోసం ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు తమ జనాభాలో ఎక్కువమందికి టీకాలు వేయడం పూర్తి చేయడంతో, ఆయా దేశాలు ఇప్పుడు బూస్టర్ డోసుపై ఫోకస్ పెట్టాయి, అంతేకాకుండా ఇతర దేశాల కోసం కోవిడ్ టీకాల అభివృద్ధి మరియు సరఫరాను ప్రారంభించాయి. అయితే భారత్ లో మాత్రం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికలను బట్టి చూస్తే, ఇప్పటివరకు దేశ జనాభాలో కేవలం 8 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క రెండు డోసులు లభించినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 44,643 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,56,757 కు చేరింది. నిన్న ఒక్కరోజే 464 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,26,754కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,096 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,10,15,844 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,14,159 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.36% స్వల్పంగా తగ్గగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.30 శాతానికి పెరిగాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
India reports 44,643 new #COVID19 cases, 41,096 recoveries and 464 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Active cases: 4,14,159
Total recoveries: 3,10,15,844
Total vaccination: 49,53,27,595 pic.twitter.com/nePjKXAqvv
— ANI (@ANI) August 6, 2021
ఆగష్ట్ 5 నాటికి దేశవ్యాప్తంగా 47,65,33,650 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 16,40,287 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 57,97,808 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 5 కోట్లకు చేరువైంది.. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 49,53,27,595 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 38.56 కోట్లు ఉండగా, 10.96 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.