New Delhi, September 3: దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి, రోజూవారీ కేసులు నిన్నటితో పోలిస్తే ఈరోజు సంఖ్య స్వల్పంగా తక్కువగానే ఉన్నప్పటికీ 45 వేల మార్కు దాటాయి. మరోవైపు కరోనావైరస్ యొక్క కొత్త వేరియంట్లు ఉత్పన్నమవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారి పట్ల పలు మార్గదర్శకాలు జారీచేసింది. విమానాశ్రయం చేరుకోగానే ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేసుకోవడం తప్పనిసరి చేసింది. ముఖ్యంగా మధ్య ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మరియు చైనాతో సహా మరో ఏడు దేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు ప్రభుత్వం RT-PCR పరీక్షను తప్పనిసరి చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది. దేశవ్యాప్తంగా పండుగలు మరియు ఇతర వేడుకల్లో వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారు మాత్రమే పాల్గొనాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న మొత్తం కొత్త కేసులలో 70 శాతం కేసులు కేరళ రాష్ట్రం నుంచి ఉండటం గమనార్హం.
గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 45,352 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 366 కోవిడ్ మరణాలు సంభవించాయి. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 32,097 కేసులు, 188 మరణాలు ఉన్నాయంటే ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,03,289 కు చేరింది, అలాగే ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,39,895 కు పెరిగింది.
ఇక, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34,791 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,20,63,616 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,99,778 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.45% కు చేరగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.22 శాతానికి పెరిగాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
India reports 45,352 new #COVID cases, 34,791 recoveries & 366 deaths in the last 24 hours, as per Health Ministry; recovery rate at 97.45%
Active cases: 3,99,778
Total recoveries: 3,20,63,616
Death toll: 4,39,895
Total vaccination: 67,09,59,968 pic.twitter.com/1p6womc7fI
— ANI (@ANI) September 3, 2021
సెప్టెంబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా 52,65,35,068 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 16,66,334 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 74,84,333 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 67.09 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 67,09,59,968మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 51.55 కోట్లు ఉండగా, 15.54 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.