COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, July 8:  భారత్‌లో సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి తగ్గుతున్నా, దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ కోవిడ్ కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటున్నాయి. నిన్నటికంటే ఈరోజు దేశంలో స్వల్పంగా 2 వేల మేర కేసులు పెరిగాయి అయితే మరణాలు 9 వందల లోపే నమోదయ్యాయి. రికవరీ రేటు 97.18 శాతానికి మెరుగుపడింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు యూటీలలోని పలు జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా నమోదవుతుండటంతో కేంద్రం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సమీక్షలు నిర్వహిస్తూ మహమ్మారి వ్యాప్తి నియంత్రణ కోసం మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్ మరియు సరైన కోవిడ్ నిబంధనలు అనే ఐదు రెట్లు వ్యూహాన్ని అనుసరించాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 45,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,09,557 చేరింది. నిన్న ఒక్కరోజే 817 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,05,028 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,291 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,98,43,825 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,05,028 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.18% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.50 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.32% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూలై 7 నాటికి దేశవ్యాప్తంగా 42,52,25,897 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 18,93,800 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 33,81,671 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 36.48 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 36,48,47,549 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 29.58 కోట్లు ఉండగా, 6.89 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.