Coronavirus- India (Photo Credits: PTI)

New Delhi, July 2:  భారత్‌లో సెకండ్ వేవ్ కరోనా చాలా వరకు అదుపులోకి వచ్చింది, శుక్రవారం నాడు రోజూవారీ కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. మరణాలు కూడా 9 వందల లోపే నమోదయ్యాయి. అయితే దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాలు 4 లక్షల మార్కును దాటాయి. కరోనా మరణాల్లో ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ దేశాల తర్వాత భారత్ మూడో స్థానంలోకి వచ్చింది. అమెరికాలో ఇప్పటివరకు 6 లక్షలకు పైగా కోవిడ్ మరణాలు రికార్డ్ కాగా, ఆ తర్వాత బ్రెజిల్ 5.2 లక్షలకు పైగా మరణాలతో రెండో స్థానంలో ఉంది. భారత్ తర్వాత 2.3 లక్షల కరోనా మరణాలతో మెక్సికో నాలుగు స్థానంలో , 1.9 లక్షల మరణాలతో పెరూ 5వ స్థానంలో ఉంది.

భారతదేశంలో గడిచిన మే నెలలో సెకండ్ వేవ్ భయంకరంగా విజృంభించింది. అప్పుడే ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదయ్యాయి. మళ్లీ లాక్డౌన్ ఆంక్షలు, వ్యాక్సినేషన్ మరియు కట్టుదిట్టమైన నివారణ చర్యలతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది.

గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 46,617 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,58,251 చేరింది. నిన్న ఒక్కరోజే 853 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,00,312 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 59,384 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,95,48,302 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 5,09,637 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.01% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.67 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.31% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూలై 1 నాటికి దేశవ్యాప్తంగా 41,42,51,520 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 18,80,026 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 42,64,123 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 34 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 34,00,76,232 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 27.94 కోట్లు ఉండగా, 6.06 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.