Coronavirus Outbreak | Representational Image (Photo Credits: PTI)

New Delhi, April 9:  భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఒకవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ గతంలో కంటే వేగంగా  వైరస్ వ్యాప్తి చెందుతుండటం గమనార్హం. ఒక్కరోజులోనే కొత్తగా 1 లక్షా 31 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఈ ఏడాదిలోనే అత్యధికం అని చెప్పవచ్చు. కేవలం 11 రోజుల్లోనే దశంలో 10 లక్షలకు పైగా కేసులు పెరిగాయంటే సెకండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  చాలా ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్లతో నిండిపోతుండటంతో ఇతర ఆనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వెళ్దామనుకునే వారికి వైద్యం కరువైపోతుంది. వైద్య, ఆరోగ్య వనరులు తగ్గిపోతున్నాయి. కొన్ని ఆసుపత్రులైతే కోవిడ్ చికిత్స మినహా మిగతా అన్ని వైద్య సేవలను రద్దు చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు ఇంకా దారుణమైన పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ప్రయాణాలు మానుకోవడం సహా ఇతర అన్ని కోవిడ్ మార్గదర్శకాలను పాటించాల్సిందిగా సూచిస్తున్నారు.

గత 24 గంటల్లో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,31,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 56,286 కేసులు ఉన్నాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య  1,30,60,542కు చేరింది. నిన్న ఒక్కరోజే 780 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,67,642కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 61,899 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,19,13,292 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 9,79,608 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 91.22 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 7.50 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.28% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఏప్రిల్ 8 నాటికి దేశవ్యాప్తంగా 25,40,41,584 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 13,64,205 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 9.4 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 9,43,34,262 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.