Coronavirus in India (Photo-PTI)

New Delhi, April 22: భారత్‌లో కోవిడ్ సెకండ్ అల్లకల్లోలం సృష్టిసోంది. రోజువారీ కేసుల సంఖ్య గురువారం 3 లక్షల మార్కును దాటాయి. ఒకప్పుడు అమెరికాలో ఇంతటి తీవ్రస్థాయిలో కేసులు రాగా, ఇప్పుడు భారత్ ఆ స్థాయికి మించి కేసులు నమోదు చేయడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వారం రోజుల కిందటే ఏప్రిల్ 15న రోజూవారీ కోవిడ్ కేసులు 2 లక్షల మార్కును దాటాయి. అయితే పరిస్థితులు మరింత దిగజారుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. మే చివరి నాటికి రోజూవారీ కేసులు 3 లక్షలు దాటే అవకాశం ఉందని వారు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ కనీసం మే నెల ప్రారంభం కూడా కాకుండానే భారతదేశంలో కేసులు మరో రికార్డును అందుకున్నాయి. కుంభమేళాలో లక్షల మంది యాత్రికులు పోటెత్తారు. దేశంలోని పలు చోట్ల రాజకీయ ఊరేగింపులు, ర్యాలీలు, ఇతర సమ్మేళనాల్లో జనాలు పోటెత్తడంతోనే పరిస్థితి ఇంతటికి దిగజారినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇందులో జనాలను నిందించటం కంటే  పాలకుల నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపిస్తోంది.

గత 24 గంటల్లో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 3,14,835 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 67,468 కేసులు ఉన్నాయి. గుజరాత్ నుంచి 12,553, కేరళ నుంచి  22,414, కర్ణాటక నుంచి 23,558 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,30,965కు చేరింది. నిన్న ఒక్కరోజే 2,104 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,84,657కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,78,841 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,34,54,880 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 22,91,428 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 84.46 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 14.38 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.16% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఏప్రిల్ 21 నాటికి దేశవ్యాప్తంగా 27,27,05,103 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 16,51,711 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 13.23 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 13,23,30,644 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి కూడా టీకా అందుబాటులోకి రానుంది. అయితే ఈ టీకాలకు ఉచితంగా ఇవ్వడం నుంచి కేంద్ర ప్రభుత్వం మెల్లిగా తప్పుకుంటోంది. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పజెప్పింది. తొలి 30 కోట్ల డోసులనే ఉచితంగా పంపిణీ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ పాలసీ విమర్శలకు తావిస్తోంది.