Covid in India: ఏమిటీ ఈ కల్లోలం, ఒక్కరోజులోనే 2,023 మంది కరోనాతో మృతి, కొత్త‌గా 2,95,041 మందికి కోవిడ్ పాజిటివ్, దేశంలో మళ్లీ మొదలైన వలస కూలీల కష్టాలు, ప్రభుత్వాస్పత్రిలో ఆరుగురు కరోనా బాధితులు చికిత్స పొందుతూ మృతి
Coronavirus Death Toll in India (Photo-IANS)

New Delhi, April 21: దేశంలో నిన్న‌ కొత్త‌గా 2,95,041 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 1,67,457 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,56,16,130 కు (Coronavirus in India) చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 2,023 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,82,553కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,32,76,039 మంది కోలుకున్నారు. 21,57,538 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 13,01,19,310 మందికి వ్యాక్సిన్లు (Coronavirus Vaccination) వేశారు.

కోవిడ్ కారణంగా దేశంలో వలస కూలీలు ఎదుర్కొన్న దుర్భర పరిస్థితి గతేడాది దేశం మొత్తాన్ని కలచి వేసింది. కాగా కోవిడ్ రెండవ దశ విజృంభిస్తున్న నేపధ్యంలో వలస కూలీలకు మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో ఎదుర్కొన్నటువంటి దుర్భర పరిస్థితులు ప్రస్తుతం లేనప్పటికీ.. ప్రభుత్వ ఆంక్షలు వారిని తీవ్రంగా భయపెడుతున్నాయి. మళ్లీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తారన్న ఆందోళనతో ముందుగానే బ్యాగ్ సర్దుకొని సొంతింటికి వెళ్తున్నారు.

వలస కూలీలకు భరోసా ఇవ్వండి, కరోనా సమస్యకు లాక్‌డౌన్ పరిష్కారం కానే కాదు, సమష్టిగా పోరాడితేనే సాధ్యం, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ

ఢిల్లీ, ముంబై సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లలో క్యూలు కడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ, జార్ఖండ్‌లలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూలు సహా అనేక ఆంక్షలు విధించారు. కోవిడ్ ప్రభావాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తప్పనిసరి అనుకుంటేనే రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాలని సూచించారు. ఈ నేపధ్యంలో వలస కూలీల్లో మరింత ఆందోళన నెలకొంది.

గతంలో కంటే ప్రస్తుతం దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. ఢిల్లీ, యూపీల్లో మునుపెన్నడూ చూడని భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఒక వైపు కోవిడ్ భయం, మరోవైపు దేశం లాక్‌డౌన్ దిశగా వెళ్తుందేమోనన్న ఆందోళన. ఈ రెండు కారణాలతో వలస కూలీలు స్వస్థలానికే వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. గతం వారం రోజులుగా దేశ వ్యాప్తంగా వేల మంది వలస కూలీలు సొంతింటికి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రాహుల్‌ గాంధీకి కరోనా పాజిటివ్, తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు

తమిళనాడులోని వేలూరులో గల అడుక్కుమ్‌పారైలోని ప్రభుత్వాస్పత్రిలో ఆరుగురు కరోనా బాధితులు చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడ 250 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా, వారిలో తీవ్ర లక్షణాలున్న వారిని ఐసీయూ ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఐసీయూ గదికి ఆక్సిజన్‌ అందజేసే పైపులు మరమ్మతులకు గురై ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది.

ఆ విభాగంలో చికిత్స పొందుతున్న రాజేశ్వరి (68), వెంకటేశన్‌, సెల్వరాజ్‌, లీలావతిలు ఒకరి తర్వాత ఒకరు మృతిచెందారు. అలాగే, హృద్రోగం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్న రాజేంద్రన్‌, ప్రేమ్‌, కబాలి మృతిచెందారు. వీరంతా అక్సిజన్‌ అందకపోవడం వల్లే మృతిచెందారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు.

హోం క్వారంటైన్‌లోకి ఢిల్లీ ముఖ్యమంత్రి, కోవిడ్‌-19 బారిన పడిన కేజ్రీవాల్‌ సతీమణి సునీత, ఢిల్లీని వణికిస్తున్న కరోనావైరస్, వారం రోజుల పాటు లాక్‌డౌన్ అమలు

దీంతో, ఇక్కడ చికిత్స పొందుతున్న బాధితులు, వారి బంధువుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వాస్పత్రిని కలెక్టర్‌ షణ్ముగసుందరం, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ నారాయణబాబులు పరిశీలించారు. వీరి మృతికి ఆక్సిజన్‌ అందకపోవడం కారణం కాదని, హృద్రోగ, శ్వాసకోశ సమస్యలతో మృతిచెందారని ఆస్పత్రి డీన్‌, కలెక్టర్‌ వేర్వేరుగా తెలిపారు.

రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేదని ఆరోగ్యశాఖ మంత్రి డా.సి.విజయభాస్కర్‌ స్పష్టం చేశారు. నగరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వేలూరు ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌ అందకపోవడంతో ఏడుగురు మృతిచెందారనే ఆరోపణలు వాస్తవం కాదన్నారు. వారు ఇతర ఆరోగ్య సమస్యలతో మృతిచెందారని, ఈ విషయాన్ని ఆస్పత్రి డీన్‌ కూడా స్పష్టం చేశారని తెలిపారు. ఇలాంటి వదంతులను ప్రజలు నమ్మరాదని మంత్రి పేర్కొన్నారు.