COVID Second Wave: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయం, గడిచిన 24 గంటల్లో 2 లక్షలు దాటిన రోజూవారీ పాజిటివ్ కేసులు, దేశంలో 14.71 లక్షలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య
COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, April 15: భారత్‌లో కోవిడ్ సెకండ్ విలయం ఉగ్రరూపం దాల్చింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఉప్పెనలా కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఉదయం భారత్ యొక్క రోజూవారీ కోవిడ్ కేసులు 2 లక్షలు దాటాయి.  కేసులు ఇంతలా పెరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్లో నిర్లక్ష్యం ఇంకా కనిపిస్తుంది. కుంభమేళాకు లక్షల మంది యాత్రికులు పోటెత్తారు. దేశవ్యాప్తంగా ఊరేగింపులు, ర్యాలీల్లో ఇతర సమ్మేళనాల్లో జనాలు రద్దీగా కనిపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే, మున్ముందు పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మే చివరి నాటికి రోజూవారీ కేసులు 3 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. కేసులు పెరుగుతున్న మిగతా రాష్ట్రాల్లో కూడా కఠిన లాక్డౌన్ ఆంక్షలు అమలు పరిచే యోచనలో ఆయా ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి.

గత 24 గంటల్లో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,00,739 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 58,952 కేసులు ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీ నుంచి కూడా గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా 17,282 కేసులు, ఉత్తరప్రదేశ్ నుంచి 20,439 కేసులు మరియు గుజరాత్ నుంచి 7410 కేసులు వెలుగుచూశాయి.  తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,74,564కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,038 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,73,123కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 93,528 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,24,29,564 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 14,71,877 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 91.22 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 7.50 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.28% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఏప్రిల్ 14 నాటికి దేశవ్యాప్తంగా 26,20,03,415 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 13,84,549 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 11.44 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 11,44,93,238 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.