COVI19 in India: భారత్‌లో సెకండ్ వేవ్ కరోనా బీభత్సం.. ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 3.86 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, వరుసగా మూడో రోజు 3 వేలకు పైగా కోవిడ్ మరణాలు
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, April 30: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. మే నెలలో రోజూవారీ కేసులు 3 లక్షల మార్కును దాటుతాయన్న అంచనాలను తలకిందులు చేస్తూ ఏప్రిల్ లోనే అంతకుమించి కేసులు రాగా, ఇపుడు మే నెల ప్రారంభమయ్యే నాటికి 4 లక్షల కేసులకు చేరువగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం భారతదేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు 3.86 లక్షలకు పైగా నమోదయ్యాయి, అలాగే వరుసగా మూడో రోజున 3,000 మందికి పైగా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

శుక్రవారం ఉదయం వరకు భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 3,86,452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధిక.  తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,87,62,976కు చేరింది. నిన్న ఒక్కరోజే 3,495 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,08,330 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,97,540 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,53,84,418 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 31,70,228 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 81.99 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 16.90 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.11% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఏప్రిల్ 29 నాటికి దేశవ్యాప్తంగా 28,63,92,086 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 19,20,107 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 15.22 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 15,22,45,179 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రేపు, శనివారం నుంచి మూడో ఫేజ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇందులో భాగంగా 18 ఏళ్ల పైబడిన వారికి కూడా టీకా పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.