New Delhi, May 18: భారత్‌లో నిన్న కొత్తగా 2,63,533 మందికి కరోనా నిర్ధారణ (Coronavirus in India) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 4,22,436 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,52,28,996కు ( COVID-19 in India) చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 4,329 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,78,719కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,15,96,512 మంది కోలుకున్నారు. 33,53,765 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,44,53,149 మందికి వ్యాక్సిన్లు వేశారు.
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది. అయితే కరోనా మృతుల సంఖ్యలో మార్పులేదు. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనాతో నాలుగు వేలకు పైగా బాధితులు మృతి చెందుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కరోనాకు ఎక్కువగా ప్రభావితమైన పది రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టడం విశేషం.
ఈ జాబితాలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ హర్యానా ఉన్నాయి. అదే సమయంలో ఉత్తరాఖండ్‌తో సహా దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో ఈ రాష్ట్రాల్లో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది.
వీటిలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, అసోం, ఒడిశా, త్రిపుర, ఉత్తరాఖండ్ ఉన్నాయి. కర్ణాటకలోని 27 జిల్లాల్లో కరోనా వ్యాప్తి రేటు 20 శాతానికి పైగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే మధ్యప్రదేశ్‌లోని 38 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్ రేటు 10 శాతానికి పైగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 2.11 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో రికవరీ రేటు మళ్లీ 84.81 శాతానికి చేరింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక ఇప్పటివరకు 244 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 50 మంది డాక్టర్లు కరోనాకు బలి కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోందని ఐఎంఏ పేర్కొంది. అత్యధికంగా బీహార్లో 69 మంది, ఉత్తరప్రదేశ్ లో 34 మంది, ఢిల్లీలో 27 మంది డాక్టర్లు కరోనాతో కన్నుమూశారని వివరించింది.
దేశంలోని మొత్తం డాక్టర్లలో కేవలం 3 శాతం మందే 2 డోసుల వ్యాక్సిన్ పొందారని పేర్కొంది. అందుకే డాక్టర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నామని, అందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఐఎంఏ వెల్లడించింది. కరోనా ఫస్ట్ వేవ్ లో మొత్తం 736 మంది డాక్టర్లు చనిపోయారని వివరించింది.
దేశంలో మహమ్మారి తీవ్రరూపం దాలుస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టడి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు మంగళవారం సమీక్ష చేయనున్నారు. క్షేత్రస్థాయి అధికారులతో నేడు ప్రధాని మోదీ సమీక్ష చేస్తారని పీఎంఓ అధికారులు ప్రకటించారు.
పలు రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో వర్చువల్‌గా ప్రధాని సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి చర్యలను ప్రధానికి అధికారులు వివరించనున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న 9 రాష్ట్రాల్లోని 46 జిల్లాల అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నట్లు పీఎంఓ వెల్లడించింది.