Kochi, September 21: భారత నౌకాదళంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. యుద్ధ నౌకల్లో ఇప్పటిదాకా పురుషులే నౌకాదళంలో సేవలు అందిస్తుండగా ఇప్పుడు మహిళలు (Women Airborne Combatants) కూడా వారి సరసన చేరారు. లింగసమానత్వాన్ని పునర్నిర్వచిస్తూ యుద్ధనౌకల్లో (Warships) తొలి మహిళా అధికారులుగా సబ్ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి (Sub Lieutenant Kumudini Tyagi), రితిసింగ్‌లు (Sub Lieutenant Riti Singh) అడుగుపెట్టనున్నారు.
భారత నౌకా దళంలో పలు ర్యాంకుల్లో ఎంతోమంది మహిళా అధికారులున్నా యుద్ధనౌకల్లో వీరి నియామకం ఇదే తొలిసారి. ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉండటం, సిబ్బంది క్వార్టర్లలో ప్రైవసీ ఇబ్బందులు, మహిళలు, పురుషులకు ప్రత్యేక బాత్‌రూంల కొరత వంటి పలు కారణాలతో ఇప్పటివరకూ యుద్ధ నౌకల్లో మహిళా అధికారులను నియోగించలేదు.
త్వరలో యుద్ధనౌకలో చేరనున్న ఈ ఇద్దరు మహిళా అధికారులు (Indian Navy Officers) వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. నౌకాదళం అమ్ములపొదిలో చేరనున్న అత్యాధునిక ఎంహెచ్-60ఆర్ హెలికాఫ్టర్లలో వీరు విధులు నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఎంహెచ్-60ఆర్ హెలికాఫ్టర్లు శత్రు దేశాల నౌకలు, సబ్‌మెరైన్లను గుర్తిస్తాయి. 2018లో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ లాక్‌హీడ్-మార్టిన్ నిర్మించిన ఈ హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేశారు.
కాగా రఫేల్ యుద్ధవిమానాలకు ఎంపిక చేసిన పైలట్లలో ఓ మహిళా పైలట్‌ను ఐఏఎఫ్ నియమించేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో నేవీలో ఇద్దరు మహిళా అధికారుల నియామకం సైన్యంలో మహిళలకు సమ ప్రాతినిథ్యం దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు పంపింది. కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడాలోని ఇండియన్ నేవీ అబ్జర్వర్ కోర్సులో ఉత్తీర్ణులైన 17 మందిలో వీరిద్దరితోపాటు ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన నలుగురు మహిళా అధికారిణిలు, ముగ్గురు అధికారులు ఉన్నారు.
సోమవారం జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రియర్ అడ్మిరల్ ఆంటోనీ జార్జ్, చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (శిక్షణ) గ్రాడ్యుయేటింగ్ అధికారులకు అవార్డులు, సంబంధిత పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రియర్ అడ్మిరల్ ఆంటోనీ జార్జ్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ అధికారులను అభినందించారు. మహిళలకు హెలికాప్టర్ ఆపరేషన్లలో తొలిసారి శిక్షణ ఇవ్వడం ఒక మైలురాయి వంటిదని అన్నారు. భారత నావికాదళంలో ముందుండే యుద్ధనౌకలలో మహిళలను మోహరించడానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు.