Image of Indian Railways |(Photo Credits: Flickr)

New Delhi, May 2: కేంద్రం ప్రభుత్వం కరోనావైరస్ లాక్డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన నేపథ్యంలో అందుకనుగుణంగా భారతీయ రైల్వే శాఖ కూడా అన్ని రకాల ప్యాసెంజర్ రైలు సర్వీసులను మే 17 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని ముందస్తు బుకింగ్‌లు నిలిపివేయబడతాయి. ఇ-టికెట్‌ ద్వారా కూడా అడ్వాన్స్ రిజర్వేషన్లు అనుమతించబడవు అయితే టికెట్ క్యాన్సలేషన్ సౌకర్యం మాత్రం ఆన్‌లైన్ లో యాక్టివ్ గా ఉంచుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

అయినప్పటికీ రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారంతో లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు మొదలగు వారిని తమ సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు "శ్రామి స్పెషల్" రైళ్లను నడుపుతామని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ANI's Update :

ప్రతి ప్రత్యేక రైలులో 1,000-1,200 మంది ప్రయాణికులు, ప్రయాణించనున్నారు. ఎవర్ని పంపించాలనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే జాబితా సిద్ధం చేయాలి. దాని ప్రకారం ఆ రాష్ట్రానికి నియమింపబడిన నోడల్ అధికారికి ఒకేసారి బల్క్ టికెట్లను రైల్వేశాఖ జారీ చేయనుంది.

ప్రయాణికులకు నిర్ధేషించబడిన రైల్వే స్టేషన్లో మాస్క్ లు, శానిటైజర్స్, ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లను వారిని తరలించే రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ఒకవేళ దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటే రైలులోనే భోజన వసతి కల్పిస్తారు.

ప్రయాణికులందరినీ నాన్- ఏసీ కోచ్ లలోనే తరలించనున్నారు. నాన్ స్లీపర్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ బోగీ యొక్క ఒక్కో విభాగంలో 6 మందిని తరలించనున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా వీరందరికీ రైలు ఎక్కేముందు స్క్రీనింగ్ నిర్వహిస్తారు. కరోనా లక్షణాలు లేనపుడే ప్రయాణానికి అనుమతిస్తారు. అంతేకాకుండా గమ్యస్థానం చేరిన తర్వాత కూడా స్క్రీనింగ్ నిర్వహిస్తారు, అవసరమనుకుంటే క్వారైంటైన్ కేంద్రాలకు తరలించే అవకాశమూ ఉంటుంది.