Image of Indian Railways |(Photo Credits: Flickr)

New Delhi, May 11: కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా సుమారు యాభై రోజులుగా ప్రజా రవాణా స్తంభించిపోయింది. అయితే ఎట్టకేలకు మే 12 నుంచి ప్యాసింజర్ రైలు సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. రేపట్నించి దశల వారీగా ప్యాసెంజర్ రైళ్లను క్రమంగా నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తొలి దశలో న్యూఢిల్లీ నుంచి 15 రైలు సర్వీసులు దేశంలోని ముఖ్య పట్టణాలకు రాకపోకలు సాగించనున్నాయి. ఇందుకోసం కేవలం ఆన్‌లైన్‌లో బుకింగ్స్ కు మాత్రమే అనుమతించనున్నారు. ఈరోజు (మే 11) నుంచి ఐఆర్‌సిటిసి (irctic.co.in) వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, సాయంత్రం 4 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి.

రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లు మూసివేయబడే ఉంటాయి. ప్లాట్ఫాం టిక్కెట్లతో సహా ఎలాంటి కౌంటర్ టికెట్లు జారీ చేయబడవు అని రైల్వే శాఖ తెలిపింది. అంతేకాకుండా టికెట్ కలిగిన వ్యక్తిని మాత్రమే స్టేషన్ లోకి అనుమతిస్తారు. ముఖానికి మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి, బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్క ప్రయాణికుడు స్క్రీనింగ్ చేయించుకోవాలి, కరోనా లక్షణాలు లేని ప్రయాణికులు మాత్రమే అనుమతించబడతారు అని రైల్వే అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Notification Issued by Indian Railways:

ఈ ప్రత్యేక రైళ్లు న్యూఢిల్లీ స్టేషన్ నుండి దిబ్రుగర్, అగర్తాలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మాడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్ మరియు జమ్మూ తవీ తదితర ప్రాంతాలను కలుపుతూ రానుపోను సర్వీసులు నడవనున్నాయి.

మెల్లిమెల్లిగా రైల్వే కోచ్‌ల లభ్యతను బట్టి రైళ్ల సంఖ్యను పెంచుతూ మరిన్ని మార్గాలలో నడుపుతామని భారతీయ రైల్వే తెలిపింది. ప్రస్తుతం సుమారు 20,000 బోగీలను కోవిడ్-19 సంరక్షణ కేంద్రాలుగా రిజర్వ్ చేయబడ్డాయి. వీటితో పాటు ప్రతిరోజు వలస కార్మికులను చేరవేసేందుకు 300 ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ఇండియన్ రైల్వేస్ నడుపుతుంది.