Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, October 1: భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన కఠిన లాక్డౌన్ నుంచి మెల్లిమెల్లిగా ఆంక్షలను సడలించుకుంటూ నేడు అన్‌లాక్ 5 లోకి అడుగుపెట్టాము, ఇప్పటికీ కూడా దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రావడం లేదు. ఇక దేశప్రజలు కూడా కరోనావైరస్ తోనే సహజీవనానికి అలవాటు పడ్డారు. ముఖానికి మాస్క్, ఎక్కడికైనా వెళ్తే శానిటైజర్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 86,821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 63,12,585కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,181 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 98,678కు పెరిగింది.

మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకొని ప్రతిరోజు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో 85,376 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 52,73,201 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 9,40,705 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID Tracker:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 83.05% ఉండగా, మరణాల రేటు కేవలం 1.6% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా 7,56,19,781 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 14,23,052 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది. 

ఇక దేశంలో నేటి నుంచి అన్‌లాక్ 5 అమలులోకి రానుంది.  అక్టోబర్‌లో దుర్గాపూజతో సహా  అనేక మతపరమైన ఉత్సవాలు జరగనున్నందున అన్‌లాక్ 5.0 అత్యంత కీలకమైనదిగా మారే అవకాశం ఉంది.

అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌కు  అనుమతినిచ్చింది. అయితే, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా సినిమా థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. విద్యా సంస్థలు ఎప్పుడు తెరవాలన్న దానిపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. అక్టోబర్ 15 తర్వాత రాష్ట్రాలు విద్యాసంస్థలు తెరవడంపై, విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదించాక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.