New Delhi, June 12: భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) ఒక్క రోజే పది వేల మార్కును దాటింది. . గత 24 గంటల్లో దేశంలో 10956 కేసులు రికార్డు అయ్యాయి. ఒకే రోజులో పదివేల మార్క్‌ను దాటడం దేశంలో ఇదే మొదటిసారి. తాజాగా కరోనా వైరస్ (Coronavirus in India) ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్ బ్రిటన్‌ను దాటి నాలుగోస్థానంలో నిలిచింది. శుక్రవారం రోజున కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 396 మంది మృతి చెందారు. మొత్తంగా 2,97,535 కేసులు, 8,498 మరణాలతో (Coronavirus Death Toll) నాలుగో స్థానానికి చేరుకుంది.
కాగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,41,842 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని 1,47,195 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 49 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 53,63,445 కరోనా టెస్టులు నిర్వహించగా.. గడిచిన 24 గంటల్లో 1,50,305 టెస్టులు నిర్వహించారు. మరోసారి పూర్తి లాక్‌డౌన్‌ను ఎందుకు అమలు చేయకూడదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు, చెన్నైలో కరోనా పరిస్థితిపై ఆందోళన
మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఒక్క రోజే 3607 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 152 మంది మరణించారు. ఓవరాల్‌గా మహారాష్ట్రలో 97648 కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రం పాజిటివ్ కేసుల విషయంలో కెనడాను దాటేసింది. మహారాష్ట్రలో 46078 మంది కోలుకున్నారు. ఒక్క ముంబైలోనే 54085 కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ముంబైలో 1954 మంది మరణించారు. తమిళనాడులో 38,716 కేసులు నమోదవ్వగా.. 349 మంది మృతి చెందారు. ఢిల్లీలో 34,687 కేసులు నమోదవ్వగా.. 1,085 మంది మృతి చెందారు. గుజరాత్‌లో 22,032 కేసులు నమోదవ్వగా 1,385 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది.