New Delhi, Mar 20: దేశంలో రోజు రోజుకు ఇన్‌ఫ్లుయెంజా ప్లూ కేసులు (Influenza Alert) పెరుగుతున్నాయి. ఎంతోమంది దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు తదితర లక్షణాలతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆరోగ్య శాఖ కొన్ని సలహాలు విడుదల చేసింది. ప్రజలంతా వీటిని తప్పక పాటించాలని పిలుపునిచ్చింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union health minister) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 44,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 918 కొత్త కేసులు బయటపడ్డాయి.
దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,350కి చేరింది. ఇక గత 24 గంటల్లో నలుగురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,806కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ప్రజలు తప్పక పాటించాల్సిన నియమాలు: తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోరు, ముక్కుకు టవల్, కర్చీఫ్, లేదా టిష్యూ పేపర్‌ను అడ్డుగా పెట్టుకోవాలి, ఆపై చేతులను సబ్బుతో నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అవసరం లేకుండా కన్ను, ముక్కు , నోటిని చేతులతో ముట్టరాదు.అధిక రద్దీ ఉండే స్థలాలకు వెళ్లడం తగ్గించాలి, రద్దీ ప్రాంతాల్లో మాస్కును ధరించాలి. ప్లూ జ్వరంతో బాధపడే వ్యక్తులనుంచి కనీస దూరం పాటించాలి. రోజూ బాగా నిద్రపోవాలి. తీవ్ర శ్రమ కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఆలింగనం, ముద్దు పెట్టుకోవడం, జనరద్దీ ప్రాంతాల్లో ఉమ్మివేయడం వంటివి చేయరాదు. వైద్యుల సలహాలేకుండా ఔషధాలను, యాంటి బయాటిక్ మందులను తీసుకోరాదు.
ఇన్‌ఫ్లుయెంజా ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి: జ్వరం, జలుబు, అస్వస్దత, ఆకలి లేకపోవడం, చేతులు,కాళ్లు నొప్పులు, దీర్ఘకాలికంగా జలుబు తదితర లక్షణాలు ఇన్‌ఫ్లుయెంజా రోగ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాలి. వైద్యుల సలహా మేరకు ఇంటిలోనే విశ్రాంతి తీసుకోవాలి. ప్రయాణాలు చేయరాదు. మాస్కు ధరించడం ముఖ్యం. రోగ లక్షణాలు ప్రారంభమైన తరువాత కనీసం 7 రోజుల పాటు ఆరోగ్యవంతులకు దూరంగా ఉండాలి. లేదంటే రోగి వల్ల ఇతరులకు సులభంగా వ్యాపించే ప్రమాదం ఉంది.