Sasikala's Assets Freezed: ఎన్నికల వేళ శశికళకు ఐటీ షాక్, రూ 2000 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసిన ఆదాయపు పన్ను శాఖ, బెంగళూరు పర్పప్పన అగ్రహార జైలులో చిన్నమ్మ
V K Sasikala (Photo Credit: PTI/File)

Chennai, October 7: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా మెలిగి అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న శశికళకు (VK Sasikala) ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఆదాయ పన్ను (Income Tax Department) అధికారులు ఆమెకు చెందిన రూ 2000 కోట్ల విలువైన ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద (Sasikala's Assets Freezed) స్తంభింపచేశారు. వీటిలో రూ 300 కోట్ల విలువైన రెండు ఆస్తులున్నాయి. సిరుతవుర్‌, కొడనాడు ప్రాంతాల్లోని ఈ ఆస్తులు జయలలిత సన్నిహితురాలు శశికళ, ఇలవరసి, సుధాకరన్‌ల పేరు మీద ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు.

చెన్నై పోయెస్‌ గార్డెన్‌లో జయలలిత నివాసగృహానికి ఎదురుగా స్థలాన్ని కొనుగోలు చేసి, జయ నివాసానికి దీటుగా శశికళ భవన నిర్మాణం చేపట్టారు. రూ.300 కోట్ల విలువచేసే ఆ స్థలం కూడా శశికళ బినామీ ఆస్తిగా గుర్తించిన ఆదాయపన్ను శాఖ ఫ్రీజ్ చేసినట్లు ప్రకటించింది. ఈ బినామీ ఆస్తులన్నీ శశికళ, ఇళవరసి, సుధాకరన్ పేర్ల మీద ఉన్నట్లు ఐటీ గుర్తించింది. ఈ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్లు సదరు స్థలాల వద్ద ఐటీ అధికారులు నోటీసులు అంటించారు.

దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పర్పప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసి వచ్చే ఏడాది జనవరిలో ఆమె విడుదల కానున్నట్టు సమాచారం హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. వీకే శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌కు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో బెంగళూరులోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

జైలు నుంచి విముక్తి, రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం, సెలబ్రిటీలు ఏమన్నారంటే..

షెల్ కంపెనీలతో (బోగస్ కంపెనీలు) శశికళ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు ఆస్తులను అటాచ్ చేశారు. మార్చి 9, 1995న శశికళ ‘శ్రీ హరి చందన ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఓ బినామీ కంపెనీని తెరపైకి తెచ్చినట్టు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేంద్రంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను ఈ కంపెనీ సాగించినట్లు అధికారులు గుర్తించారు. 2003-05 మధ్య కాలంలో శశికళ 200 ఎకరాలను కొనుగోలు చేసినట్లు ఐటీ శాఖ చెప్పుకొచ్చింది. మొత్తం 65 ఆస్తులను శశికళ కూడబెట్టినట్లు తెలిపింది.

దీంతో పాటు పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.1674 కోట్ల విలువైన స్థిరాస్తుల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలతో అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ.. బంధువులకు లేఖ రాసినట్టు ఆదాయపు పన్నుల శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సందర్భంలో శశికళ తన వద్దనున్న కోట్లాది రూపాయల విలువచేసే రూ.500లు, రూ.1000నోట్లను మార్పిడి చేసుకునేలా స్థిరాస్తులు కొనుగోలు చేశారు. అంతే కాకుండా రూ.237 కోట్ల విలువైన ఆ పాత పెద్దనోట్లను పౌష్టికాహార పథకం కాంట్రాక్టరుకు రుణంగా కూడా ఇచ్చారు. ఈ వివరాలు తాము జరిపిన తనిఖీలలో వెల్లడైనట్టు ఆదాయపు పన్నుల శాఖ ప్రకటించింది.

అదే సంవత్సరం నవంబర్‌లో శశికళ వదిన ఇళవరసి కుమారుడు వివేక్‌ జయరామన్‌ నివాసగృహంలో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు తనిఖీలు జరిపినప్పుడు శశికళ రాసిన ఆ లేఖలను స్వాధీనం చేసుకున్నారు. శశికళ తమిళంలో తన స్వదస్తూరీతో ఆ లేఖలు రాసినట్టు కనుగొన్నారు. ఆ లేఖలను గురించి వివేక్‌ జయరామన్‌ను ఐటీ అధికారులు ప్రశ్నించినప్పుడు ఇంటి వాచ్‌మెన్‌ వద్ద గుర్తు తెలియిని వ్యక్తులు ఇచ్చి వెళ్లారని తెలిపాడు.

ఆ లేఖలను ఎందుకు ఇంటిలో భద్రపరిచావని అడిగినప్పుడు ఆ లేఖలను గురించి శశికళతో ఫోన్‌ చేసి మాట్లాడాలనుకున్నానని, ఆ కారణంగా వాటిని భద్రపరిచానని సమాధానం తెలిపారు. నెల రోజులకు పైగా ఆ లేఖలను భద్రపరచి ఆయన శశికళతో మాట్లాడలేదని అధికారులు కనుగొన్నారు. ఇక ఆ లేఖలోని సంతకం శశికళదేనని ఆమె న్యాయసలహాదారుడు సెంథిల్‌ సైతం ధ్రువీకరించినట్టు ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత దత్త పుత్రుడు, శశికళ అక్క కుమారుడు సుధాకరన్, ఆయన భార్య ఇలవరసి పేర్ల మీద ఉన్న ఆస్తులను కూడా ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. చెంగల్పట్టు జిల్లాలోని సిరుదాఊరు బంగాళా, కొడనాడు ఎస్టేట్‌లోని ఆస్తులు అటాచ్ చేశారు. నెలరోజుల క్రితం శశికళ బినామీ ఆస్తిగా గుర్తించిన 200 కోట్ల విలువైన నిర్మాణంలో ఉన్న భవనాన్నిఆదాయపన్ను శాఖాధికారులు సీజ్ చేశారు.