
Nagpur, Feb 13: మహారాష్ట్రలోని నాగపూర్ సెంట్రల్ జైలులో మరోసారి కరోనా కలకలం రేగింది. మావోయిస్టు సంబంధాలతో సంబంధాలు ఉన్నాయంటూ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో (GN Saibaba Covid Positive) సహా మరో ముగ్గురు కోవిడ్ బారిన పడ్డారు.
సాయిబాబాకు శుక్రవారం కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందనీ, సిటీ స్కాన్ ఇతర పరీక్షల కోసం తీసుకువెళ్ల నున్నామని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అనుప్ కుమార్ కుమ్రే తెలిపారు. అలాగే చికిత్స కోసం ఆయనను (Jailed Ex Delhi University professor GN Saibaba) ప్రభుత్వ వైద్య కళాశాల లేదా ఆసుపత్రికి తరలించాలా అనేది వైద్యులు నిర్ణయిస్తారని చెప్పారు.
90 శాతం అంగవైకల్యం, ఇప్పటికే జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా ఆరోగ్యంపై ఇప్పుడు తీవ్ర అందోళన వ్యక్తమవుతోంది. ఇదే జైల్లో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ అరుణ్ గావ్లీతోపాటు మరో అయిదుగురికి ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై యుఏపీఏ చట్టం కింద ప్రొఫెసర్ సాయిబాబాకు నాగపూర్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ఆయనతోపాటు మరో నలుగురికి కూడా శిక్షపడింది. దీంతో 2017 మార్చి నుంచి సాయిబాబా నాగపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వికలాంగుడైన సాయిబాబాను మానవతా దృక్ఫథంతో విడిచిపెట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున‍్న సంగతి తెలిసిందే.