Ramban, SEP 08: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ప్రజలు భారత్‌లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పిలుపునిచ్చారు. విదేశీయులుగా పరిగణిస్తున్న పాకిస్థాన్‌లా కాకుండా మిమ్మల్ని మా స్వంతంగా భావిస్తున్నామని అన్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (JK Election) నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ ఠాకూర్‌కు మద్దతుగా రాంబన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ప్రసంగించారు. పాకిస్థాన్ అదనపు సొలిసిటర్ జనరల్ ఆ దేశ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారని, పీవోకే (Pakistan-Occupied Kashmir) భూమిగా అందులో పేర్కొన్నట్లు తెలిపారు.
Here's Video
पाकिस्तान की सरकार पीओके को foreign land मानती है लेकिन भारत पीओके को अपना मानता है… pic.twitter.com/dYg4fxYsaT
— Rajnath Singh (@rajnathsingh) September 8, 2024
‘పాకిస్థాన్ మిమ్మల్ని విదేశీయులుగా పరిగణిస్తోంది. అయితే భారత్ ప్రజలు మిమ్మల్ని అలా పరిగణించరని పీవోకే నివాసితులకు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని మా స్వంతంగా పరిగణిస్తాం. వచ్చి మాతో చేరండి’ అని అన్నారు.
కాగా, 2019 ఆగస్ట్ 5న ఆర్టికల్ 370ను రద్దు చేసినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లోని మొత్తం భద్రతా పరిస్థితిలో భారీ మార్పు వచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇప్పుడు యువకులు పిస్టల్స్, రివాల్వర్‌లకు బదులుగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లను చేత పట్టుకుంటున్నారని అన్నారు. ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామన్న నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఎన్నికల వాగ్దానంపై ఆయన మండిపడ్డారు. బీజేపీ ఉన్నంత వరకు అది అసాధ్యమని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి మద్దతివ్వాలని అక్కడి ప్రజలను కోరారు.