Bengaluru, Mar 8: కర్ణాటకలో మాజీ మంత్రి జార్కిహొళి రాసలీలల సీడీ కేసు మలుపులు (Karnataka 'Sex for Favours' Scandal) తిరుగుతోంది. తాజాగా బీజేపీ నేత రమేశ్ జార్కిహొళిపై (former minister Ramesh Jharkiholi) ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త దినేశ్ కల్లహళ్లి తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం దినేశ్ తరపున ఆయన న్యాయవాది దినేశ్ పాటిల్ కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు లేఖ ఇచ్చారు.
అయితే ఇప్పటివరకు సీడీల్లో ఉన్న యువతి జాడ తెలియరాలేదు. మరికొందరు మంత్రులపై దినేశ్ కుట్రలు చేస్తున్నాడని, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని మరికొందరు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో దినేశ్ (Dinesh Kallahalli) యూ టర్న్ చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఫిర్యాదు చేసిన తర్వాత జరిగిన ఘటనలతో విసిగిపోయి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు దినేశ్ తెలిపారు. తాను డీల్ కుదుర్చుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నానని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించడంతో అసహనానికి గురయినట్లు చెప్పారు.
ఇక కర్ణాటకలో వీడియో సీడీలంటేనే మంత్రులు వణికిపోతున్నారు. తమకు చెందిన సీడీలు ఏవైనా ఉంటే వాటిపై పత్రికలు, టీవీ చానెళ్లలో వార్తా ప్రసారాలు రాకుండా చూడాలని పలువురు మంత్రులు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్లను వేసిన సంగతి విదితమే. దీనికి కోర్టు కూడా అంగీకారం తెలుపుతూ తాత్కాలిక అనుమతి ఇచ్చింది. సిటీ సివిల్ కోర్టు వెబ్‌సైట్లో పేర్కొన్న ప్రకారం శివరాం హెబ్బార్, బీసీ పాటిల్, హెచ్‌టీ సోమేశేఖర్, కె.సుధాకర్, నారాయణగౌడ, బైరతి బసవరాజు ఉన్నట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే మంత్రుల పిటిషన్లపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. అలా పిటిషన్లను వేసిన ఆరుమంది మంత్రులను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని జేడీఎస్ ఎమ్మెల్యే. సా.రా. మహేష్ డిమాండు చేశారు. శనివారం మైసూరులో మాట్లాడుతూ.. తమకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే వాటిని మీడియాలో ప్రసారం చేయకుండా ఆదేశాలను జారీ చేయాలని ఆరుమంది మంత్రులు కోర్టును ఆశ్రయించారని, వారిపై కఠిన చర్యల తీసుకోవాలని అన్నారు.
ముంబైకి వెళ్ళిన మంత్రులు అక్కడ చేసిన ఘనకార్యాలు ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఎద్దేవా చేశారు. పలువురు ప్రతిపక్ష నేతలు ఇదే తరహాలో ఆరోపణలు సంధించారు. మంత్రి పదవుల్లో ఉన్నవారు తమ వీడియోల గురించి డిమాండ్లు చేయడం అసెంబ్లీని అవమానపర్చడమేనని ధ్వజమెత్తారు. మీరు తప్పు చేయకుంటే కోర్టును ఎందుకు ఆశ్రయించారని మహేశ్ ప్రశ్నించారు. అంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఆ వీడియోలు బయటకి వస్తే మీ బండారం మొత్తం బయట పడుతుంది, అలా జరగకుండా కోర్టుకెళ్లారు అని ఆరోపించారు.
మంత్రి రమేశ్ జార్కిహొళి సెక్స్ వీడియో బయటకు, కర్ణాటక రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్న సీడీ
ఇక తమ సీడీలను విడుదల చేయరాదని కొందరు కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు అనవసరంగా కోర్టుకెళ్లడం సరికాదని కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ అన్నారు. ఆయన శనివారం బెంగళూరు కేసీ జనరల్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకొని విలేకర్లతో మాట్లాడారు. రాసలీలల సీడీపై పార్టీ జాతీయ అధ్యక్షునికి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సమాచారం పంపించారు. మీడియాలో వచ్చిన వార్తలనూ నాయకత్వానికి పంపారు. ఇలాంటి ఘటనల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కేరళ సీఎంపై బంగారం స్మగ్లింగ్ వంటి బలమైన ఆరోపణలు వచ్చినందున ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాగా ఇటీవల జలవనరుల మంత్రి రమేశ్ జార్కిహొళి అశ్లీల వీడియో బయటకు రావడం, ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. అయితే మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని వార్తలు వస్తున్నాయి. రాజకీయ శతృత్వంతో ఆయనే రహస్య వీడియోలు తీయించి బయటికి తెచ్చాడని చెబుతున్నారు. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది. పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మొబైల్ నంబరు కూడా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.
ఇక కర్ణాటకలో రాసలీలలు, లైంగిక దాడులు, సీడీ గందరగోళాలు మంత్రులకు కొత్తేమి కాదు. గతంలో కూడా చాలా మంది మంత్రులు ఇలాంటి సెక్స్ స్కాండల్స్‌లో చిక్కుకుని రాజీనామాలు చేయాల్సి వచ్చింది. గతంలో మంత్రులుగా పనిచేసిన హెచ్‌వై మేటీ, హరతాళ్ హాలప్ప, లక్ష్మణ సవది, జె.కృష్ణ పాలేమార్, సీసీ పాటిల్ తదితర అనేక మంది సీడీల కారణంతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
స్నేహితుని భార్యపై రేప్ ఆరోపణలతో మంత్రి హరతాళ్ హాలప్ప
2010, మే నెలలో బీజేపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల మంత్రిగా పనిచేసిన హరతాళ్ హాలప్ప స్నేహితుని ఇంటికి వెళ్లి అతని భార్యపై అత్యాచారం చేశారనే ఆరోపణలు మంత్రిపై వినిపించాయి. బాధితులు అప్పటి గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో సంచలనమైంది. దీంతో అప్పటి సీఎం యడియూరప్ప వెంటనే హాలప్పను పిలిపించుకుని రాజీనామా చేయించారు. ఆ తర్వాత హాలప్పపై కేసు కూడా నమోదు అయింది. కోర్టులో హాలప్ప నిర్దోషిగా తీర్పు వచ్చింది. 2018లో హాలప్ప మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య నర్సుతో ముద్దుముచ్చట
2007లో బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య... జయలక్ష్మి అనే నర్సుతో ముద్దుముచ్చట సాగిస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే తనను మోసం చేశారని ఆమె ఫోటోలతో ప్రెస్‌మీట్ పెట్టారు. అప్పటినుంచి ఆయనకు మంత్రి పదవి అందరిని ద్రాక్ష అయ్యింది.
చట్టసభలో ముగ్గురు మంత్రుల నీలి చిత్రాల వీక్షణం
2012 ఫిబ్రవరి 7న విధానసభలో అశ్లీల చిత్రాలు వీక్షించారనే ఆరోపణలపై బీజేపీ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికింది. అప్పట్లో విధానసభలో సహకార మంత్రి అయిన లక్ష్మణ సవది, పర్యావరణ మంత్రి జె.కృష్ణపాలెమార్, మహిళా, శిశు సంక్షేమ మంత్రి సీసీ పాటిల్‌లు మొబైల్‌ఫోన్లలో అశ్లీల దృశ్యాలను చూస్తు ఉన్న దృశ్యాలు మీడియాలో కథనాలుగా ప్రసారం అయ్యాయి. మరుసటి రోజే ముగ్గురూ పదవులకు రాజీనామా చేశారు. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలెమార్ ఓడిపోగా మిగిలిన ఇద్దరూ గెలిచారు.
కూలీ మహిళతో బ్కారీ మంత్రి మేటీ
మూడేళ్ల కిందట సిద్ధరామయ్య ప్రభుత్వంలో అబ్కారీ మంత్రిగా ఉన్న మేటీ ఆయుర్వేద ఆస్పత్రిలో రోజూవారీ కూలీగా పనిచేస్తున్న మహిళను లైంగికంగా వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బాగల్‌కోటలోని అతిథిగృహంలో ఆమెతో గడిపిన వీడియోలు వచ్చాయి. ఆ మహిళ తరఫున సామాజిక కార్యకర్త రాజశేఖర్ ములాలీ ఢిల్లీలో ఈ రాసలీలల దృశ్యాల సీడీని విడుదల చేశారు. దీంతో సిద్ధరామయ్య ఆయన చేత రాజీనామా చేయించారు.
జార్కిహొళి రాజీనామా
ఇప్పుడు ప్రస్తుత జలవనరుల మంత్రి రమేశ్ జార్కిహొళి వంతు వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక యువతిని నమ్మించి వాంఛలు తీర్చుకున్నారని వీడియో, ఆడియోలు విడుదలయ్యాయి. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు సంధించడంతో ముఖ్యమంత్రి యడియూరప్ప బుధవారం జార్కిహొళి చేత రాజీనామా చేయించారు.