Bengaluru, August 21: కర్ణాటకలో ఓ వ్యక్తి టెక్నాలజీ ముసుగులో దారుణానికి పాల్పడ్డాడు. సాంకేతికతను అడ్డుపెట్టుకుని మహిళల నగ్నచిత్రాలను (Man uses spy cam to harass woman) తీయడం మొదలు పెట్టాడు. వాటిని ఆ మహిళలకు చూపి బెదిరిస్తున్న కామోన్మాదిని ఈశాన్య విభాగ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పై కెమెరా (Man uses spy cam) వినియోగించి ఈ దారుణాలకు పాల్పడుతున్న వ్యక్తి మైసూరు జిల్లా టీ.నరసిపురకు చెందిన మహేశ్‌గా పోలీసులు గుర్తించారు.
ఒక యువతి ఫిర్యాదుతో ఇతని బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ యువతి ఇన్‌స్టా అకౌంట్‌కు మహేశ్ నుంచి మెసేజ్ రాగా, ఎవరో అపరిచితుడు అని బ్లాక్ చేసింది. మళ్లీ వేరే ఇన్‌స్టా ఖాతా నుంచి మెసేజ్‌లు చేసి, తనతో చనువుగా చాట్ చేయాలని డిమాండ్ చేశాడు. లేకపోతే మీ నగ్న వీడియో తన వద్ద ఉందని బెదిరించాడు. ఆమె పట్టించుకోలేదు. అయితే ఆ దుండగుడు నిజంగానే ఒక వీడియోను ఆమెకు పంపాడు. అది చూసి బాధితురాలు భయభ్రాంతురాలైంది. ఎందుకంటే ఆ వీడియో ఆమె ప్రైవేటు రూమ్‌లో చిత్రీకరించినట్లు తెలుసుకుని ఈశాన్య విభాగ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న సీఈఎన్ పోలీసులు తీవ్రంగా గాలించి మైసూరులో మహేశ్ ను శనివారం అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి స్పై కెమెరా, ల్యాప్‌టాప్, రెండు మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్, రెండు సెల్‌పోన్లను స్వాదీనం చేసుకున్నారు. నిందితుడు మహేశ్, ఫిర్యాదురాలికి పరిచయస్తుడు కాగా ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె రూమ్‌లో మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చాడు. ఇంకా ఎన్ని చోట్ల ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడు అనేదానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈశాన్య విభాగం డీసీపీ అనూప్ ఏ.శెట్టి, సీఐ సంతోష్ రామ్ ఈ కేసును దర్యాప్తు చేశారు.