New Delhi, DEC 01: దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’కు (Delhi liquor scam) సంబంధించిన అమిత్ అరోరా (Amit Arora) రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (MP Magunta Srinivasulu Reddy) పేర్లు ఉన్నట్లు వెల్లడైంది. అమిత్ అరోరా రిమాండు రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారి పేర్లను పేర్కొంది. లిక్కర్స్ స్కాం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అమిత్ అరోరాని (Amit Arora) ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన రూ.100 కోట్లకు కంట్రోలర్ గా శరత్ చంద్ర, కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. అమిత్ ఆరోరా ఫోన్ కాల్ డేటాలో (Phone data) కవిత ఫోన్ నెంబర్ ఉంది. ఆరోరాతో కవిత పలు సార్లు మాట్లాడారు. అమిత్ ఆరోరా తన ఫోన్ నుంచి కవితకు 10 సార్లు కాల్ చేసినట్లు ఈడీ పేర్కొంది.
బుధవారం అమిత్ అరోరాను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగానే రిపోర్టు దాఖలు చేయగా అందులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు తెలిసింది. లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిందని, ఆ గ్రూపును శరత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ వివరించింది. ఆ గ్రూపు ద్వారా విజయ్ నాయర్ కు రూ.100 కోట్లు చేరాయని ఈడీ తెలిపింది.
అంతేగాక, 36 మంది 170 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని, సాక్ష్యాలు లేకుండా చేయడానికి కుట్ర పన్నారని చెప్పింది. ధ్వంసమైన ఫోన్లలో కవితవి 2 నెంబర్లు ఉన్నాయని చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాళ్ల పేర్లు ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో ఉండడం గమనార్హం.