Madhura, Dec 15: మధురలో గల కృష్ణ జన్మభూమి వివాదంలో (Krishna Janmabhoomi land case) షాహీ ఈద్గా మసీదు సర్వేను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో షాహీ ఈద్గా మసీదును సర్వే (Shahi Idgah complex survey) చేయడానికి అలహాబాద్ హైకోర్టు గురువారం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదాన్ని నిలిపివేయాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ధర్మాసనం (Supreme Court) మసీదు సర్వేను నిలిపివేయడానికి నిరాకరిస్తూ తీర్పును వెలువరిచింది.
ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతినిచ్చిన సంగతి విదితమే. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్‌ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది.
మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి.
కాగా శ్రీకృష్ణుడి జన్మించిన ప్రదేశంలో మసీదుని నిర్మించారని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. సర్వే చేపట్టాలంటూ దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను పరిశీలించిన స్థానిక కోర్టు సర్వే చేపట్టాలంటూ గతేడాది డిసెంబర్‌లో ఆదేశాలు ఇవ్వగా ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టులో సవాలు చేసింది. సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు గురువారం (నిన్న) సర్వే చేపట్టేందుకు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆదేశాలను ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో సుప్రీంకోర్టు తన వైఖరిని స్పష్టం చేసింది.