File image of Kulbhushan Jadhav | (Photo Credits: PTI)

Islamabad/New Delhi, July 8: పాకిస్థాన్ మిలిటరీ కోర్టు తనను దోషిగా ప్రకటిస్తూ, మరణ శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరేందుకు భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ తిరస్కరించారని పాకిస్థాన్ ప్రకటించింది. తాను క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేశానని, దానిపైనే తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని పేర్కొంది. అయితే ఆయనకు రెండోసారి కాన్సులర్ యాక్సెస్ అవకాశం కల్పిస్తామని తెలిపింది.  పినరయి విజయన్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి, కేరళలోని ప్రతిపక్ష యూడీఎఫ్ డిమాండ్, స్వప్న సురే‌శ్‌కు తమకు సంబంధం లేదని తెలిపిన కేరళ సీఎం

కుల్‌భూషణ్ జాదవ్ గూఢచర్యం చేస్తుండగా అరెస్టు చేశామని పాకిస్థాన్ చెప్తోంది. కానీ ఆయన ఇరాన్‌లో వ్యాపారం చేస్తున్నారని, చాబహార్ పోర్టు నుంచి ఆయనను అక్రమంగా అపహరించి, కేసు నమోదు చేశారని భారత ప్రభుత్వం ఆరోపించింది కుల్’భూషణ్ జాదవ్‌‌ను 2016 మార్చి 3న బలూచిస్థాన్‌లో అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ భద్రతా దళాలు చెప్తున్నాయి. ఆయన ఇరాన్ నుంచి పాకిస్థాన్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు చేసినట్లు చెప్తున్నాయి.

ఓ ఏడాది తర్వాత పాకిస్థాన్ మిలిటరీ కోర్టు జాదవ్‌‌కు మరణ శిక్ష విధించింది. గత ఏడాది జూలైలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇచ్చిన తీర్పులో ఆయనకు విధించిన మరణ శిక్షను పునఃసమీక్షించాలని, ఆయనకు కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో జాదవ్ తనకు విధించిన శిక్ష, తనను దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పులను పునఃసమీక్షించాలని కోరేందుకు ఇష్టపడలేదని పాకిస్థాన్ బుధవారం తెలిపింది. తాను దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌పై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపింది.

ఇస్లామాబాద్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో అడిషినల్ అటార్నీ జనరల్ అహ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, కుల్‌భూషణ్ జాదవ్ పెండింగ్‌లో ఉన్న క్షమాభిక్ష పిటిషన్‌ను కొనసాగించేందుకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ ఆయనకు రెండోసారి కాన్సులర్ యాక్సెస్ ఇస్తోందని చెప్పారు. జాదవ్‌కు విధించిన శిక్ష, దోషిత్వ ప్రకటనలను పునఃసమీక్షించాలని కోరేందుకు ఆయనకు జూన్ 17న అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు.

గడువు ముగియక ముందే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని భారత హై కమిషన్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం పదే పదే లేఖలు రాస్తోందని చెప్పారు. ఐసీజే తీర్పును స్ఫూర్తిదాయకంగా అమలు చేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

జాదవ్‌కు మొదటిసారి కాన్సులర్ యాక్సెస్ మంజూరు చేయడంతో గత ఏడాది సెప్టెంబరు 2న ఆయనను పాకిస్థాన్‌లోని మన దేశ డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లూవాలియా ఇస్లామాబాద్‌లో కలిశారు.