Lakhimpur Kheri, December 14: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో అక్టోబర్ 3l రైతులపై జరిగిన హింసాకాండ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పర్యటనలో నిరసన చేస్తున్న రైతులపైకి ఆయన కొడుకు ఆశిశ్ మిశ్రా కారుతో దూసుకెళ్లాడని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఘటనలో (Lakhimpur Kheri Incident) నలుగురు రైతులు మరణించగా.. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర మంత్రి కొడుకు ఆశిశ్ మిశ్రా ప్రధాన నిందితుడిగా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే.. రైతులు, విపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడితో కేంద్రం.. ఈ ఘటనపై సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిట్.. మంగళవారం కీలక విషయాలను వెల్లడించింది. ఈ హింసాకాండ ప్రణాళికాబద్దమైన కుట్ర (Lakhimpur Kheri Incident Was Well Planned) అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రాపై ఇప్పటికే నమోదైన అభియోగాలను మార్చాలంటూ ఈ కేసు విచారణ జరుపుతున్న న్యాయమూర్తికి సిట్ లేఖ రాసింది. ఇప్పటికే ఈ కేసులో మంత్రి కుమారుడు ఆశిశ్ మిశ్రా, తదితరులపై హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలతోపాటు హత్యాయత్నం, ఇతర అభియోగాలను కూడా ఈ కేసులో చేర్చాలని సిట్ ఆ లేఖలో కోరింది. IPCలోని 279, 338 మరియు 304A సెక్షన్‌ల స్థానంలో కొత్త సెక్షన్లను వారెంట్‌లో చేర్చాలని సిట్ దర్యాప్తు అధికారి విద్యారామ్ దివాకర్ గత వారం CJM కోర్టులో దరఖాస్తు చేశారు.
తన దరఖాస్తులో, దర్యాప్తు అధికారి ఈ సంఘటన బాగా ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వక చర్య అని, నిర్లక్ష్యం లేదా నిర్లక్ష్యానికి ఈ ఘటన సాక్ష్యం కాదని ఎత్తి చూపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 279ని భర్తీ చేసిన తర్వాత సెక్షన్‌లు 307 (హత్య ప్రయత్నం), 326 (ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా స్వచ్ఛందంగా తీవ్రమైన గాయాన్ని కలిగించడం), 34 (ఉమ్మడి ఉద్దేశ్యంతో అనేక మంది వ్యక్తులు చేసిన చర్యలు) జోడించాలని దర్యాప్తు అధికారి అభ్యర్థించారు. (పబ్లిక్ మార్గంలో ర్యాష్ డ్రైవింగ్ లేదా రైడింగ్), 338 (ఏదైనా ఆకస్మికంగా లేదా నిర్లక్ష్యంగా చేయడం ద్వారా ఎవరికైనా తీవ్రమైన గాయం కలిగించే వ్యక్తి), IPC యొక్క 304A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) వంటి వాటిని కూడా చేర్చాలని కోరారు.
లఖింపుర్‌లో సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపైకి అక్టోబర్ 3న ఆశిశ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లింది. ఆ ఘటనలో మొత్తం 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసాకాండలో స్థానిక జర్నలిస్టు కూడా చనిపోయాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సైతం వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా రైతులు, పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసును త్వరగా విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది.
సిట్ ఇప్పటివరకు ఆశిష్ మిశ్రా, లువ్‌కుష్, ఆశిష్ పాండే, శేఖర్ భారతి, అంకిత్ దాస్, లతీఫ్, శిశుపాల్, నందన్ సింగ్, సత్యం త్రిపాఠి, సుమిత్ జైస్వాల్, ధర్మేంద్ర బంజారా, రింకు రాణా, ఉల్లాస్ త్రివేదిలను అరెస్టు చేసింది. వారిని లఖింపూర్ ఖేరీ జిల్లా జైలులో ఉంచారు.మరోవైపు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాల సమయం ఇచ్చింది. కేసు విచారణ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ వినోద్ షాహి ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు గురించి కోర్టుకు వివరించారు. ఇంకా పెద్ద సంఖ్యలో సాక్షుల వాంగ్మూలాలు నమోదు కావాల్సి ఉందని షాహి తెలిపారు.