Lakhimpur Kheri, October 9: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ ఖేరి ఘటనలో (Lakhimpur Kheri Violence Case) కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా (Ashish Mishra) విచారణకు హాజరయ్యాడు. సుప్రీం ఆదేశాలతో గత బుధవారం యూపీ పోలీసులు విచారణకు హాజరవ్వాలంటూ ఆయనకు సమన్లు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేదు. ఘటన జరిగిన అనంతరం కనిపించకుండా పోయిన ఆయన శనివారం ఉదయం యూపీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
లఖింపూర్ ఖేరీ ఘటనపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అశిష్ మిశ్రాను ఇంటరాగేట్ చేస్తోంది. తమ పోలీసు కార్యాలయానికి వచ్చిన ఆశిష్ మిశ్రాను విచారిస్తున్నామని యూపీ పోలీసు డీఐజీ ధ్రువీకరించారు. రైతులపై నుంచి కారు నడిపి చంపిన కేసులో ఆశిష్ మిశ్రా పోలీసు దర్యాప్తునకు రావాలని యూపీ పోలీసులు నోటీసు ఇచ్చారని దీంతో తన క్లయింట్ దర్యాప్తునకు వచ్చారని అతని న్యాయ సలహాదారు అవదేష్ కుమార్ చెప్పారు.
పోలీసుల నోటీసుపై స్పందించి దర్యాప్తులో తన క్లయింట్ సహకరిస్తారని అవదేష్ కుమార్ చెప్పారు. లఖింపూర్ ఖేరీ క్రైంబ్రాంచ్ పోలీసు కార్యాలయంలో దర్యాప్తు నకు కేంద్ర మంత్రి కుమారుడైన ఆశిష్ మిశ్రా హాజరు కావడంతో కార్యాలయం పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కారుతో రైతులను ఢీకొట్టించి చంపిన కేసు నేపథ్యంలో కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన జరిపారు.
లఖింపూర్ ఘటనలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవర్నీ అరెస్టు చేయలేమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసులో కేంద్ర మంత్రి మిశ్రా (Son of Union Minister Ajay Mishra) కుమారుడు ఆశిష్‌ను అరెస్టు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే అని, సుప్రీంకోర్టు కూడా ఇదే చెబుతోందని, ఎటువంటి ఆధారం లేకుండా ఎవర్నీ అరెస్టు చేయలేమని, ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని సీఎం యోగి తెలిపారు.
లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఎవర్నీ వదిలిపెట్టేదిలేదని సీఎం చెప్పారు. ఎవరికీ అన్యాయం చేయమని, అలాగే ఒత్తిడిలో ఎటువంటి చర్యలు చేపట్టబోమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని, చట్టం ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తుంటే, ఆ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, అది ఎవరైనా పర్వాలేదని సీఎం యోగి అన్నారు.
లఖింపూర్ వెళ్తున్న ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వాళ్లేమి శుభసందేశకులు కాదన్నారు. శాంతి, సామరస్యాన్ని నెలకొల్పడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, ఖేరికి వెళ్దామనుకుంటున్నవారే అక్కడ జరిగిన హింసకు కారణమని, విచారణ తర్వాత అన్ని అంశాలు స్పష్టంగా బయటకు వస్తాయని సీఎం చెప్పారు.
కాగా, ఈ నెల 3న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటికే అశిష్ మిశ్రాపై హత్య కేసు కూడా నమోదైంది.