Image used for representational purpose | (Photo Credits: PTI)

Hyderabad, May 27:  బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను ఒడిషా రాష్ట్రం వద్ద బుధవారం తీరం దాటేసింది. అయితే దీని ప్రభావం కొంతమేర తెలంగాణపై కూడా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మే 30 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం మే 27న ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, రంగారెడ్డి మరియు మెదక్ జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవవచ్చు.

మే 28న పైన పేర్కొన్న జిల్లాలతో పాటు హైదరాబాద్, వికారాబాద్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా 30- 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. ఆ తర్వాత రోజు నుంచి నుంచి తుఫాను ప్రభావం కొద్దికొద్దిగా తగ్గుతూ పోతుందని అయితే గాలులు మాత్రం కొనసాగుతాయని వాతావరణ శాఖ తన నివేదికలో పేర్కొంది.

మరోవైపు, రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ మరియు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నివేదించబడ్డాయి. నల్గొండలో అత్యధికంగా 42.5 నమోదైంది. మెదక్ లో 42, ఆదిలాబాద్ లో 41.5, నిజామాబాద్ లో 40.4, హైదరాబాద్ లో 39.6, భద్రాద్రి మరియు రామగుండంలలో 39.2 సెల్సియస్ చొప్పున అలాగే మహబూబ్‌నగర్ లో 39, ఖమ్మం లో 38.4, హన్మకొండలో 36.5 సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఒకవర్ష సూచన ఉన్నా, ఎండలు మాత్రం మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2.1 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. మే చివరి వరకు వాతావరణం ఇప్పుడున్నట్లు గానే కొనసాగవచ్చునని పేర్కొన్నారు.