Lucknow, July 12: ఉత్తరప్రదేశ్‌లో భారీగా కురిసిన వానలు, పిడుగులు (Lightning Strike) బీభత్సం సృష్టించాయి. రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు దాదాపు 38 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దీనికి తోడు పశు నష్టం కూడా సంభవించడం కలకలం రేపింది. ప్రాణ, పశువుల నష్టంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వం స్థానిక అధికారులను ఆదేశించింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఏకంగా 14 మంది పిడుగుపాటుతో దుర్మరణం పాలయ్యారు. కాన్పూర్‌లో అయిదుగురు, ఘజియాబాద్‌లో ముగ్గురు, కౌశుంబిలో మరో ముగ్గురు చని పోగా, ఉన్నావ్, చిత్రకూట్ ప్రాంతాలలో నలుగురు చొప్పున మరణించారు. ముఖ్యంగా భారీ వర్షం కారణంగా చెట్ల కింద ఆశ్రయం పొందిన రైతులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కౌశంబి గామానికి చెందిన రుక్మ, మూరత్, రామచంద్ర, మయాంక్ సింగ్, అలాగే ఫిరోజాబాద్ మృతులను రామ్‌సేవక్, హేమరాజ్‌గా గుర్తించారు. అదేవిధంగా నాగ్లత్ చాత్ గ్రామంలో మరో రైతు అమర్ సింగ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై యూపీ సీఎం యెగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.మృతుల కుటుంబాలకు తగిన సాయం (CM Yogi Adityanath Orders Relief) అందిస్తామని ప్రకటించారు. అటు భారీ వర్షాలు, పిడుగుల కారణంగా పశు నష్టం కూడా భారీగానే సంభవించింది. యూపీలోని ఉడ్ని గ్రామంలో పిడుగుపాటుకు 44 జంతువులు చనిపోయాయి. 42 మేకలు, ఒక ఆవు, ఎద్దు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
మరో రాష్ట్రం రాజస్థాన్‌లో (Rajasthan) పిడుగులు బీభత్సం సృష్టించాయి. రాజస్థాన్ రాష్ర్ట వ్యాప్తంగా పిడుగుపాటుకు 25 మంది చనిపోగా, ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్క జైపూర్‌లోనే 16 మంది మృతి చెందగా, 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో అమేర్ ప్యాలెస్ వద్ద ఉన్న వాచ్ టవర్‌కు నిన్న పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో వాచ్ టవర్ వద్ద భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఆ టవర్ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు పర్యాటకులు ఎగబడ్డారు. ఆ సమయంలోనే భారీ పిడుగు (Lightning Strikes While People Taking Selfies) పడింది. దీంతో అక్కడికక్కడే 11 మంది పర్యాటకులు మృతి చెందగా, మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులు పక్కనున్న లోయలో పడిపోయారు. వారందరినీ రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు సీఎం అశోక్ గెహ్లాట్ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి కూడా పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.