ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు గట్టి షాక్‌ను ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్(ఎంసీఎల్‌ఆర్)ను పెంచుతూ ఎస్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎంసీఎల్‌ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ( Sbi Hikes Mclr Across All Tenors) ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సవరించిన ఎంసీఎల్‌ఆర్ రేటు ఏప్రిల్ 15, 2022 నుంచి అమలులోకి రానుంది. ఈ నిర్ణయంతో ఎస్‌బీఐ అందించే లోన్ల వడ్డీ రేటు (loan interest rates) మరో 0.10 శాతం పెరగనుంది.
ఈ పెంపు అన్ని రకాల టెన్యూర్స్‌కు వర్తించనుంది. ఎస్‌బీఐ ( State Bank of India) తీసుకున్న నిర్ణయంతో లోన్లను తీసుకునే వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుంది. ఇక గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతరత్ర రుణాలు చెల్లించేవారిపై ఈఎంఐ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ ఆధారంగానే సదరు లోన్లపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఎంసీఎల్‌ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు అనేది బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)2016లో ప్రవేశపెట్టింది. ఎంసీఎల్‌ఆర్ పెరుగుదలతో...ఎస్‌బీఐ గృహ, ఇతర రుణగ్రహీతల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ సవరణ ప్రస్తుత, భవిష్యత్తు రుణగ్రహీతలకు వర్తిస్తుంది.
ఎస్‌బీఐ సవరించిన ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేట్లు
ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతం.
ఒక నెల కాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 6.65 నుంచి 6.75 శాతం.
3 నెలల కాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతం.
6 నెలల కాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 6.95 శాతం నుంచి 7.05 శాతం.
ఒక ఏడాది కాలానికి ఎంసీఎల్ఆర్ 7 శాతం నుంచి 7.10 శాతం.
రెండేళ్ల కాల పరిమితికి ఎంసీఎల్ఆర్ 7.2 శాతం నుంచి 7.3 శాతం.
మూడేళ్ల కాల పరిమితిపై ఎంసీఎల్ఆర్ 7.3 శాతం నుంచి 7.4 శాతం.