COVID in India: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్.. ఢిల్లీ, మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు, మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్న కేజ్రీవాల్ సర్కార్
Coronavirus in India (Photo-PTI)

New Delhi, April 18: ఢిల్లీతోపాటు దేశ రాజ‌ధాని ప్రాంతం (ఎన్సీఆర్‌) ప‌రిధిలో తిరిగి క‌రోనా కేసులు (COVID in India) క్ర‌మంగా పెరుగుతున్నాయి. రెండు వారాలుగా రోజువారీ కేసుల్లో భారీ పెరుగుద‌ల న‌మోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప‌రిధిలో కొవిడ్‌-19 కేసుల వ్యాప్తి 500 శాతం పెరిగింద‌ని లోక‌ల్ స‌ర్కిల్ అధ్య‌య‌నంలో తేలింది. త‌మ కుటుంబ స‌భ్యుల్లో గానీ, స‌న్నిహితుల్లో గానీ ఒక‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింద‌ని 19 శాతం ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంత వాసులు (Delhi-NCR Residents) అంటున్నారు.

ఇటీవ‌లి కాలంలో క‌రోనా కేసులు (COVID-19 Spread) మ‌ళ్లీ పెరుగుతున్న నేప‌థ్యంలో మ‌హ‌మ్మారి ప్ర‌భావాన్ని అంచ‌నా వేయ‌డానికి లోక‌ల్ స‌ర్కిల్ ఓ అధ్య‌య‌నం నిర్వ‌హించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప‌రిధిలో 11,743 మంది ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించింది. త‌మ‌లో ఏ ఒక్క‌రికి క‌రోనా రాలేద‌ని 70 శాతం మంది చెబితే, 11 శాతం మంది త‌మ స‌న్నిహితుల్లో ఒక‌రిద్ద‌రు మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డార‌ని చెప్పారు. 8 శాతం మంది త‌మ వారిలో ముగ్గురి నుంచి ఐదుగురికి క‌రోనా సోకింద‌ని తెలిపారు. 11 శాతం మంది మాత్రం చెప్ప‌లేం అని జ‌వాబిచ్చారు. ఈ నెల 2న లోక‌ల్ స‌ర్కిల్ ఈ స‌ర్వే జ‌రిపింది. కేవ‌లం 3 శాతం మంది మాత్ర‌మే త‌మ స‌న్నిహితుల్లో ఒక‌రు మాత్ర‌మే కొవిడ్ భారీన ప‌డ్డార‌ని చెప్పిన‌ట్లు లోక‌ల్ స‌ర్కిల్ తెలిపింది.

చైనాలో ఘోరంగా మారిన కరోనా పరిస్థితులు, తాజాగా షాంఘైలో ముగ్గురు మృతి, లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన 40 కోట్ల మంది ప్రజలు

ఢిల్లీలో ప్ర‌స్తుతంకొవిడ్ పాజిటివిటీ రేటు 5.33 శాతానికి పెరిగింది. రెండు వారాలుగా క‌రోనా వ్యాపిస్తున్న‌ట్లు నిర్దార‌ణ కావ‌డంతో వైద్యారోగ్య‌శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. దీంతో మ‌రోమారు క‌రోనా నిబంధ‌న‌ల‌ను, మార్గ‌దర్శ‌కాల‌ను అమ‌లు చేసేందుకు ఢిల్లీ స‌ర్కార్ స‌మాయాత్త‌మ‌వుతున్న‌ది. గురువారం కేసులు 40 రోజుల గరిష్ఠానికి పెరిగి 325కు చేరాయి. అంతక్రితం వారంతో పోలిస్తే.. గత వారంలో హోం ఐసొలేషన్‌ కేసుల సంఖ్య దాదాపు 48 శాతం పెరిగి 574కు చేరింది. ఏప్రిల్‌ 11 నాటికి మొత్తం 447 హోం ఐసొలేషన్‌ కేసులు ఉండగా.. మూడు రోజుల్లోనే (ఏప్రిల్‌ 14 నాటికి) మరో 127 మందికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో హోం ఐసొలేషన్‌లోకి వెళ్లారు. దీంతో హోం ఐసొలేషన్‌లో ఉన్న మొత్తం రోగుల సంఖ్య 574కు చేరింది. ఈ కేసుల సంఖ్య 500 మార్కును దాటి పైపైకి వెళ్తుండటాన్ని ఢిల్లీ సర్కారు సీరియ్‌సగా తీసుకుంటోంది.

దేశంలో మళ్లీ పెరిగిన కేసులు, మరణాలు, కొత్తగా 2183 మంది కరోనా, గత 24 గంటల్లో 214 మంది మృతి, మరో 11,542 కేసులు యాక్టివ్‌

ఏప్రిల్‌ 1న 0.57 శాతమే ఉన్న కొవిడ్‌ పాజిటివిటీ రేటు.. 14వ తేదీ వచ్చేసరికి ఏకంగా 2.39 శాతానికి పెరగడాన్ని కూడా కీలకమైన పరిణామంగా పరిగణిస్తోంది. ఇటీవల ఢిల్లీలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బందికి కొవిడ్‌ నిర్ధారణ అయిన నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ సర్కారు అప్రమత్తమైంది. కొవిడ్‌ నిబంధనలను పాటించాల్సిదేనంటూ పాఠశాలలకు శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కొవిడ్‌ కేసులు బయటపడితే.. పాఠశాలలోని ఆ నిర్దిష్ట విభాగాన్ని లేదా తరగతి గదిని కొన్నిరోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. కేసుల సమాచారాన్ని బడులు వెంటనే విద్యాశాఖ డైరెక్టర్‌కు తెలియజేయాలని సూచించింది.

ఇక మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 127 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. శనివారంతో పోల్చితే అదనంగా 30 కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసుల నమోదు పెరుగుతున్నది. ఆదివారం 21,534 నమూనాలను పరీక్షించారు. 127 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక్క ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే 80 కేసులు నమోదయ్యాయి. పూణే డివిజన్‌లో 34 కేసులు, నాసిక్, లాతూర్, కొల్హాపూర్ డివిజన్‌లలో నాలుగు చొప్పున, నాగ్‌పూర్ డివిజన్‌లో ఒక కేసు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల మొత్తం సంఖ్య 79 లక్షలకు చేరింది. ఇందులో 77,27,372 మంది కోలుకున్నారు. అయితే గత 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదు. మరోవైపు కరోనా కేసుల నమోదు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నియంత్రణ చర్యలపై దృష్టిసారించింది.