New Delhi, May 1: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దీనికి తోడు ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో మరణాలు ఎక్కువవుతున్నాయి. వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కారు లాక్ డౌన్ (Lockdown in Delhi)మరోమారు పొడిగించింది. ఈ నెల 10 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పటికే గత నెలలో ఏప్రిల్ 19వ తేదీ నుంచి 26 వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్ ఢిల్లీలో అమలయింది. అయినప్పటికీ కేసులు పెరగక పోవడంతో తాజాగా మళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు చేపట్టారు.
దేశ రాజధానిలోని ఓ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతూ ఆక్సిజన్ కొరత కారణంగా పలువురు పేషెంట్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పేషెంట్ల మరణ వార్త అత్యంత బాధాకరమని, సకాలంలో ఆక్సిజన్ అంది ఉంటే ప్రాణాలు నిలిచేవని శనివారంనాడు ఓ ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీకి ఆక్సిజన్ కోటా ఇవ్వాలని, ఇలాంటి మరణాలు ఇంకెంత మాత్రం చోటుచేసుకోకూడదని అన్నారు.
ఢిల్లీకి 976 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే, శుక్రవారంనాడు కేవలం 312 టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఇచ్చారని, ఇంత తక్కువ మొత్తం ఆక్సిజన్‌తో ఢిల్లీ ఎలా ఊపిరి పీల్చుకుంటుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. శనివారంనాడు ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో చికిత్స సమయంలో ఆక్సిజన్ కొరత తలెత్తడంతో ఒక వైద్యుడితో సహా 8 మంది కోవిడ్ పేషెంట్లు కన్నుమూశారు.
దీనికి ముందు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేస్తూ, ఢిల్లీకి 976 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే, ఇప్పటికీ ఢిల్లీ కోటా 490 మెట్రిక్ టన్నులే ఉందని, ఇందులో కూడా తమకు అందినది 312 మెట్రిక్ టన్నులేనని, ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారని పరోక్షంగా కేంద్రాన్ని నిలదీశారు.
Here's Delhi CM Tweet
Lockdown in Delhi is being extended by one week
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 1, 2021
కాగా దేశ రాజధానిని ఆక్సిజన్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి వెంటనే 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను (High Court Directs Centre to Supply 490 Metric Tonne Oxygen) ఇచ్చి తీరాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ఆధారంగా హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
కాగా బాత్రా ఆసుపత్రిలో ఎనిమిది మంది ఆక్సిజన్ లేకపోవడం వల్ల (Oxygen Shortage in Delh) ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని తెలిపింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక విచారణలో జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖ పల్లి డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది.
కోవిడ్-19 మహమ్మారి (Covid Pandemic) విజృంభిస్తున్న సమయంలో ఢిల్లీకి 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ (490 Metric Tonne Oxygen) అవసరమని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం (Delhi Govt) హైకోర్టుకు తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ సరఫరా చేయడం లేదని తెలిపింది. శుక్రవారం రాత్రి ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు వెల్లడించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆక్సిజన్ సరఫరా కాలేదని తెలిపింది. పరిస్థితి దయనీయంగా ఉందని వివరించింది.
ఈ నేపథ్యంలో బాత్రా ఆసుపత్రి (Batra Hospital) దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు శనివారం ప్రత్యేక విచారణ జరిపింది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఓ డాక్టర్ సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని బాత్రా ఆసుపత్రి హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారమే 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఢిల్లీకి సరఫరా చేయాలని, లేనిపక్షంలో కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఢిల్లీ రాష్ట్రం కోసం ఉద్దేశించిన నాలుగు ఆక్సిజన్ ట్యాంకర్లను రాజస్థాన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, వీటిని విడిపించి, ఢిల్లీ రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది.