బ్రిటిష్‌కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాలకు సంబంధించిన బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్,ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్రం కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను తీసుకువచ్చింది.
శీతాకాల సమావేశాల పదమూడవ రోజున ఈ మూడు సవరించిన క్రిమినల్ చట్ట బిల్లులను ఆమోదించింది.బిల్లుల వివరాలకు వస్తే..భారతీయ న్యాయ (రెండవ) సంహిత. ఇది భారతీయ శిక్షాస్మృతి స్థానంలో ప్రతిపాదించిన బిల్. రెండవది భారతీయ నాగరిక్ సురక్ష (రెండవ) సంహిత. ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భర్తీ చేయాలని ప్రతిపాదించిన బిల్. ఇక మూడవది భారతీయ సాక్ష్య (రెండవ) సంహిత. ఇది భారతీయ సాక్ష్యాధారాల చట్టాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన కొన్ని కొత్త సవరణలతో పాటు బిల్లులు ఆమోదించబడ్డాయి. వైద్యపరమైన నిర్లక్ష్యం కారణంగా మరణించిన సందర్భాల్లో వైద్యులకు మినహాయింపులు ఇవ్వడానికి సంబంధించిన సవరణలలో ఒకటి. ఉభయ సభల నుంచి 141 మంది విపక్ష సభ్యుల (ఎంపీ) సస్పెన్షన్ మధ్య ఈ బిల్లులు బుధవారం మధ్యాహ్నం పార్లమెంటు దిగువసభలో ఆమోదం పొందాయి. గత వారం లోక్‌సభ నుండి 13 మంది శాసనసభ్యులు సస్పెండ్ చేయబడ్డారు.