Hyd, Sep 13: తెలంగాణ ప్రభుత్వం నేడు శాసన సభలో (Telangana Assembly Sessions 2022) ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, అజమాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సూపరెన్యుయేషన్ సవరణ బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టగా శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు శాసనసభ ఆమోదం తెలుపింది. అలాగే కావేరి, గురునానక్, శ్రీనిధి, ఎంఎన్ఆర్, నిక్‌మార్ వర్సిటీలకు అనుమతి లభించినట్లయ్యింది.
కొత్త ప్రైవేట్ వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపగా.. 12 వర్సిటీలకు ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు చాలా మంచి నిర్ణయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. నియామకాల తర్వాత కూడా కోర్టు కేసులు వస్తున్నాయని, కోర్టు తీర్పుల వల్ల కొన్ని వర్సిటీల్లో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందన్నారు. యూజీసీ నిబంధనల మేరకే ఉమ్మడి నియామకను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి నియామక బోర్డు చైర్మన్‌గా.. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఉంటారని, వీసీలే కమిటీ చైర్మన్లుగా ఉంటారన్నారు.
వర్సిటీల్లో 3వేలకుపైగా పోస్టులు భర్తీ చేసుకున్నామని, ఇక్కడి వర్సిటీల్లో దేశంలో ఎక్కడా లేని పే స్కేల్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. వాహనాల విక్రయంలో ప్రభుత్వానికి పన్నులు సరిగా వస్తాయన్నారు.
పన్నులు ఎగ్గొట్టకుండా ఉండేందుకే సవరణ బిల్లు అని తెలిపారు. డీలర్ల రాయితీ నిలువరించేందుకే పన్నుల చట్ట సవరణ బిల్లు అని, లారీల అంతర్రాష్ట్ర రాష్ట్ర పన్నులపై ఏపీ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు. గ్రీన్ ట్యాక్స్ అనేది కేంద్రప్రభుత్వం తెచ్చిందని సభకు తెలిపారు. ఈ చట్ట సవరణ వల్ల వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.