Bhopal, July 5: మరికొద్ది రోజుల్లో గిరిజన మహిళ దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబోతోంది. మొట్టమొదటి అధ్యక్షురాలిగా, దేశ ప్రధమ పౌరురాలిగా ఘనతకెక్కబోతోంది. అలాంటి చోట ఓ గిరిజన మహిళకు ఘోర అవమానం జరిగింది. మద్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో 30 ఏండ్ల గిరిజన మహిళను దారుణంగా హింసించి (Tribal woman thrashed by villagers) బహిరంగంగా అవమానించారు.
ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆ మహిళను (Tribal woman) పాక్షికంగా బట్టలు విప్పించి.. బెల్ట్‌తోనూ, కొరడాతోనూ దారుణంగా కొట్టి కిందపడేసి హింసించారు. అనంతరం ఆమె మెడలో చెప్పుల దండ వేసి, ఆమె భర్తను భుజాలపై కూర్చోబెట్టి (being made to carry husband on shoulders) ఊరేగించారు.
ఈ దారుణ ఘటన రాష్ట్రంలోని దేవాస్ జిల్లాలోని బోర్‌పదవ్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోర్‌పదవ్ గ్రామంలోని ఒక వ్యక్తి తన భార్య ఇంట్లోంచి వెళ్లిపోయిందంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె అదే గ్రామంలో తన ప్రియుడి ఇంట్లో కనిపించింది. వివాహమై మరోకరితో సంబంధం పెట్టుకుందన్న కోపంతో అతను బహిరంగంగా తన భార్యను అవమానించి, కొట్టి హింసించాడు.స్థానికులు సైతం ఆమెను రక్షించేందుకు ముందుకు రాలేదు. ఐతే ఒక వృద్ధ జంట ఆ మహిళను రక్షించేందుకు ప్రయత్నించి విఫలమైంది.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆ మహిళను రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు పాల్పడిన సుమారు 12 మంది నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ క్రూరమైన ఘటన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
బాధితురాలు ఏం చెప్పిందంటే..
తనకు 15 ఏండ్ల వయసులోనే పెండ్లి చేశారని, అప్పటి నుంచి తన భర్త చిత్రహింసలు పెడుతుండేవాడని బాధితురాలు వాపోయింది. తట్టుకోలేక స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నానని, ఏ తప్పూ చేయలేదని తెలిపింది.
ఇక ఇదే రాష్ట్రంలోని మరో జిల్లాలోఇంకో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నందుకు ఒక గిరిజన మహిళకు నిప్పటించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. రాంప్యారీ బాయి అనే ఆ మహిళ ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. బమోరి తహశీల్ పరిధిలోని ధనోరియా గ్రామ పొలంలో మహిళకు నిప్పంటించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటన చాలా సిగ్గు చేటని వ్యాఖ్యానించింది. పట్టపగలే దారుణం జరుగుతుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించింది.