Mahakumbh Mela (Photo-ANI)

New Delhi, Feb 14:  యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతోన్న కుంభమేళాలో (Kumbh Mela) శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమంలో ఈ స్థాయిలో భక్తులు పాల్గొనలేదని తెలిపింది. శుక్రవారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 92 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని, దీంతో ఇప్పటివరకు వచ్చినవారి సంఖ్య 50 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం వెల్లడించింది.

ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు, ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగియనున్న మహా కుంభమేళా, వీడియో ఇదిగో..

భారత్‌, చైనా మినహా అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని పేర్కొంది. ఇక్కడ స్నానాలు చేసిన వారి సంఖ్య అమెరికా, రష్యా, ఇండోనేసియా, బ్రెజిల్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల జనాభా కంటే ఎక్కువని యూపీ ప్రభుత్వం తెలిపింది.మహా కుంభమేళా జనవరి 13న మొదలు కాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. అదే రోజు తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా మరో 60 మంది గాయపడిన సంగతి తెలిసిందే. మరో 12 రోజులపాటు కొనసాగనుండటంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.