Mumbai, December 30: దేశంలో కొత్త రకం కరోనా వైరస్ కేసులు (COVID-19 Strain) నమోదవుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో నెలరోజులపాటు పొడిగించింది. ఈ మేరకు 2021 జనవరి 31వరకు లాక్‌డౌన్ (Maharashtra Extends Lockdown) నిబంధనలు అమలులో ఉంటాయని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని అత్యవసర జాగ్రత్తలు తీసుకునే క్రమంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను (Maharashtra lockdown) జనవరి 31వరకు పొడిగిస్తున్నామని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు కొత్త వైరస్ ఆనవాళ్లు కనిపించలేదని రాష్ట్ర వైద్యాదికారి తెలిపారు. గతకొన్నిరోజుల నుంచి యూకే నుంచి వచ్చిన వారిలో 30 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని, కానీవారిలో ఎవరికి కూడా కొత్త కరోనా రకం కనుగొనలేదని పేర్కొన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నది. వచ్చే నెల 5 వరకు పట్టణ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
ఇక ఇప్పటికే అనుమతించిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని డిసెంబర్ 29 న జారీ చేసిన సర్క్యులర్ పేర్కొంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనేక లాక్‌డౌన్ పరిమితులను సడలించింది. నవంబరులో ప్రార్థనా మందిరాలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే 9 నుంచి12 వ తరగతి వరకు పాఠశాలలు కూడా కొన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రారంభమయ్యాయి.
కాగా దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరసలో ఉంది. ప్రస్తుతం అక్కడ 19,25,066 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా 3,018 పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. 69 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 49,373కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 54,537 యాక్టివ్ కేసులున్నాయి