Mumbai, March 20: మహారాష్ట్రలో (Maharashtra) కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో (Coronavirus Outbreak) ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం సహా రాష్ట్రంలోని పలు నగరాలలో పాక్షికంగా 'షట్ డౌన్' (Shutdown) విధిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) శుక్రవారం ప్రకటించారు.
ముంబై, పుణె సహా మహారాష్ట్రలోని అన్ని ప్రధాన నగరాలలో షాప్స్ మరియు ఆఫీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి మార్చి 31 వరకు మూసివేయబడతాయని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ముంబై, ఎంఎంఆర్ రీజియన్, పుణె, పింప్రి చించ్వాడ్ మరియు నాగ్‌పూర్‌లలో ఈ లాక్‌డౌన్ అమలువుతుంది. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని రాష్ట్ర ప్రజలను సీఎం కోరారు.
అత్యవసర సేవలు మరియు ప్రజా రవాణా మినహా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌ను పూర్తిగా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్నీ దుకాణ సముదాయాలు మూసే ఉంటాయి. అయితే నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రం తెరిచే ఉంటాయని సీఎం తెలిపారు. అలాగే రాష్ట్రంలో బ్యాంకులు తమ కార్యకలాపాలు సాగిస్తాయని అని పేర్కొన్నారు.
మహరాష్ట్రలో శుక్రవారం మధ్యాహ్నం వరకు 52 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి 72 ఏళ్ల వ్యక్రి మరణించారు. అయితే 5 మంది మాత్రం వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారని సీఎం తెలిపారు. 'జనతా కర్ఫ్యూ' అంటే ఏమిటి? ప్రధానమంత్రి దేశ ప్రజల నుంచి ఏం కోరుతున్నారు?
ముంబైలో ప్రజా రవాణాను మూసివేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ప్రస్తుతానికి ప్రజా రవాణాను నిలిపివేసే నిర్ణయం తీసుకోలేమని తెలిపారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల విధుల నిర్వహణ 25% కు తగ్గుతుందని సీఎం ఠాక్రే స్పష్టం చేశారు.
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముంబైలో ఆఫీసులకు ఆహారాన్ని డెలివరీ చేసే ప్రఖ్యాత 'డబ్బా వాలాల' సేవలను మార్చి 31 వరకు నిలిపివేశారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదికల ప్రకారం మార్చి 20 ఉదయం 10 గంటల వరకు దేశవ్యాప్తంగా 13,486 మంది వ్యక్తుల నుండి 14,376 రక్త నమూనాలను పరీక్షించగా ఇందులో శుక్రవారం మధ్యాహ్నం నాటికి భారతదేశంలో 206 మందికి కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారించబడింది.