
New Delhi, JAN 14: ప్రధానమంత్రి పదవికి పోటీలో అనేక మంది నేతలు ఉన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi), మాయావతి(Mayawati), శరద్ పవార్, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ(Mamatha Banerjee), అరవింద్ కేజ్రీవాల్.. ఇలా అనేక పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీరంతా ప్రధాని అభ్యర్థులని చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే కొందరు తమకు తామే ప్రధాని అభ్యర్థులమని చెప్పుకునే నేతలు కూడా ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా విపక్షాలు ఏకమైతే ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయం మాత్రం ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ అయితే రాహుల్ మీదే ఆశలు పెట్టుకుంది. ఇక బీఎస్పీ నేతలు మాయావతి పేరు నుంచి ఒక్క అడుగు ముందుకు వేయరు. ఇక పవార్ అయితే బాగుంటుందని మమతా అయితే సరిపోతుందని అన్నవారు కూడా ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీ స్థాయికి తీసుకెళ్లిన అరవింద్ కేజ్రీవాల్ సైతం ప్రధాని అభ్యర్థిగా కనిపిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
కాగా, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ (Amartya Sen) ఈ విషయమై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే ప్రధాని అభ్యర్థికి సరిగ్గా సరిపోతారని ఆయన అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మమతాను ప్రధాని అభ్యర్థిగా తీసుకోవచ్చిన ఆయన సూచించారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీ (Mamata Banerjee) అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఆమెకు అంతటి సామర్థ్యం ఉంది.
అయితే భారతదేశంలో విభజన రాజకీయాలను అంతం చేసే శక్తి మమతకు ఉందనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అయితే మమత ప్రధాని అభ్యర్థిగా సరిపోతారు’’ అని అన్నారు. ‘‘దేశాన్ని కేవలం హిందూ దేశంగా, హిందీ మాట్లాడే దేశంగా బీజేపీ అర్థం చేసుకుంది. బీజేపీకి ప్రత్యామ్నాయం లేకుంటే చాలా ప్రమాదం’’ అని అమర్త్యసేన్ అన్నారు.