Trichy,October 4: తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తిరుచ్చి లలితా జువెలరీ షోరూమ్ లో జరిగిన రూ. 13 కోట్ల దొంగతనంలో ఎట్టకేలకు దొంగను పోలీసులు పట్టుకున్నారు. తిరువారూర్ దగ్గర బంగారంతో టూవీలర్ మీద వెళుతున్న ఆ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఈ దొంగ దొరికాడు. కాగా మరో బైక్ పై వచ్చిన మరో దొంగ పారిపోయాడు. నిందితుడి నుంచి పోలీసులు రూ.13 కోట్ల విలువ చేసే 5 కిలోల పసిడి స్వాధీనం చేసుకున్నారు. దొంగ దగ్గరున్న బంగారం బార్ కోడ్ ను పోలీసులు తనిఖీ చేయగా, లలితా జువెలరీకి సంబంధించిన గోల్డ్ గా గుర్తించారు. నిందితుడు మణికందన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మరో నిందితుడు సురేష్ కోసం గాలిస్తున్నారు. చోరీకి పాల్పడ్డ నిందితులిద్దరూ తమిళనాడు వాసులే అని పోలీసులు తెలిపారు.
డబ్బులు ఊరికే రావు అనే యాడ్‌లతో జువెలరీ రంగంలో దూసుకుపోతున్న లలితా జువెలరీకి దొంగలు భారీ షాక్ ఇచ్చిన సంగతి విదితమే. రూ. 13 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు. తిరుచ్చి సత్రం బస్‌స్టేషన్ సమీపంలోని లలితా జువెలరీ షోరూం గోడకు కన్నంవేసి లోపలకు ప్రవేశించిన దోపిడీ దొంగలు ఈ సొత్తును ఆరు బ్యాగుల్లో సర్దుకుని తీసుకువెళ్లారని సీసీ పుటేజి ద్వారా పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛాలెంజింగ్ తీసుకున్న తిరుచ్చి పోలీసులు ఏడు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపారు. ఈ కేసులో అనుమానించదగిన ప్రతి ఒక్కరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లలితా జువెలర్స్‌లో భారీ చోరీ, షోరూంకు భారీ సొరంగం
దొంగతనం జరిగింది ఇలా
#burglary #Trichy #JewelleryShop #CCTVFootage . Two masked robbers stole jewellery worth crores from #LalithaJewellery showroom in #Trichy #TamilNadu ... pic.twitter.com/KR7ObY78db
— yasir mushtaq (@path2shah) October 3, 2019
ఈ నేపథ్యంలోనే తిరుచ్చి పోలీసులు జార్ఖండ్‌కు చెందిన ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వీరంతా పుదుకోటలోని ఓ లాడ్జిలో బస చేస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. భోజనాలు తెచ్చేందుకు బయటకు వెళ్లి వస్తున్న మరో యువకుడు పోలీసులను చూసి గోడదూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. తీవ్రగాయాలతో దొరికిపోయిన అతడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు మిగిలినవారిని విచారిస్తున్నారు. కాగా పుదుకోట లాడ్జిలో అరెస్టయిన ఆరుగురి నుంచి ఆరు ప్లాస్టిక్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి లలితా జువెలరీలో దొంగలు ఉపయోగించిన నలుపు, ఎరుపు రంగులతో కూడిన బ్యాగుల్లా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ బ్యాగులు ఖాళీగా కనిపించాయి. వారివద్ద ఖాళీ బ్యాగులు ఎందుకున్నాయో తెలుసునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ గదిలో వెల్డింగ్ మిషన్ కొనుగోలుకు సంబంధించిన బిల్లు కూడా దొరికినట్లుగా తెలుస్తోంది. కాగా వారు తాము దొంగలం కాదని బ్లాంకెట్లు అమ్ముకోవడానికి వచ్చామని పోలీసులతో చెప్పినట్టు తెలిసింది.
ఇదిలా ఉంటే దొంగలు చోరీ చేసిన విధానం చూసి పోలీసులే షాక్ తిన్నారు. ముఖానికి జంతువుల మాస్క్‌లు తొడుక్కుని ఓ భారీ గ్యాస్ కట్టర్ సాయంతో రెండు అడుగుల మందపాటి గోడను కట్ చేశారు. గుర్తులు కనపడకుండా చేతులు, కాళ్లకు గ్లౌజ్ వేసుకున్నారు. పోలీస్ కుక్కల నుంచి తప్పించుకోవడానికి అక్కడ తెలివిగా కారం చల్లారు. కారం పొడి చల్లడంతో కుక్కలు.. దొంగలు వెళ్లిన మార్గాన్ని గుర్తించలేవని.. అందుకే అలా చేశారని పోలీసులు తెలిపారు.