Dabbulu Urike Ravu: లలితా జువెలర్స్‌లో భారీ చోరీ, షోరూంకు భారీ సొరంగం, 35 కిలోల బంగారు మరియు వజ్రాల ఆభరణాలు దోపిడీ,  'డబ్బులు ఊరికే రావు' యాడ్స్‌తో యజమాని చాలా పాపులర్
Robbers Strike Lalithaa Jewellery Store | Photo- FB

Trichy, October 02: 'డబ్బులు ఊరికే రావు' అంటూ అడ్వర్టైజులతో బాగా పాపులారిటీ సంపాదించిన లలితా జువెల్లర్స్ ఓనర్ కిరణ్ కుమార్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. అయితే ఆయనకు సంబంధించిన ఆభరణాల షోరూంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.  వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి పట్టణం చతిరామ్ బస్‌స్టాండ్‌లో గల 'లలితా జువెల్లర్స్' (Lalithaa Jewellery)

బంగారు ఆభరణాల షోరూంలో బుధవారం భారీ చోరీ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. షోరూమ్‌లోకి ప్రవేశించిన దొంగలు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలతో ఉడాయించినట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లలిత జ్యువెలర్స్ గోడకు దొంగలు 12 x 12 సైజులో ఒక భారీ రంధ్రం చేసి భవనంలోకి ప్రవేశించారు.

ఎప్పట్లాగే ఉదయం 9 గంటలకు దుకాణం యొక్క సిబ్బంది యథావిధిగా షట్టర్లను తెరిచి చూడగా, ఒక్కసారిగా షాక్‌కు గురయ్యే దృశ్యం కనిపించింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంచిన దాదాపు 35 కిలోల బంగారు, వజ్రాల ఆభరణాలు మాయమయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 50 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఈ మధ్యకాలంలో జరిగిన దొంగతనాలలో ఇదే అతిపెద్ద దొంగతనం అని చెప్తున్నారు.

ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఎ.అమల్‌రాజ్ నేతృత్వంలోని పోలీసు బృందం దుకాణానికి చేరుకుంది. డాగ్ స్క్వాడ్ కూడా వారి అడుగుజాడలను పసిగట్టకుండా దొంగలు చాలా పకడ్బందీగా మిరపపొడి చల్లినట్లు పోలీసులు గుర్తించారు.

ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గోడకు రంధ్రం చేయడానికి ఉపయోగించిన స్క్రూడ్రైవర్లు మరియు ఇతర పనిముట్లను సంఘటనాస్థలంలో నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం, మంగళవారం అర్ధరాత్రి దాటాక షోరూమ్ వెనుక భాగంలోని గోడ భాగాన్ని పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారని నివేదికల ప్రకారం తెలుస్తుంది.

ఈ భారీ చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగలను పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దోపిడీలో ఇద్దరే వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు మరియు షోరూమ్ చుట్టూ గత అర్ధరాత్రి నుండి నేటి తెల్లవారుజాము వరకు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల కదలికలను రికార్డ్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని ఫోన్ కాల్స్ ను కూడా పోలీసులు ట్రేస్ చేస్తున్నారు.